గిరిజన అభివృద్ధికి పాత్రికేయుల సహకారం కీలకం

ఐటీడీఏ పీఓ మంద మకరంద

ఉట్నూర్, ఆంధ్రప్రభ : గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధిలో పాత్రికేయుల పాత్ర ఎంతో కీలకమని ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి (పీఓ) మంద మకరంద అన్నారు. ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు సమన్వయంతో పనిచేస్తేనే గిరిజన ప్రాంతాల అభివృద్ధి వేగవంతమవుతుందని ఆయన పేర్కొన్నారు.

శనివారం ఉట్నూర్‌లోని కేబీ కాంప్లెక్స్ సమావేశ మందిరంలో ఏజెన్సీ మండలాల ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏజెన్సీ ప్రాంతాల్లో నెలకొన్న ప్రధాన సమస్యలు, అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై పాత్రికేయుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఐటీడీఏ ఆధ్వర్యంలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై వివరించారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని సమస్యలను పత్రికలు, మీడియా ద్వారా అధికారుల దృష్టికి తీసుకురావాలని, అత్యవసర పరిస్థితులు తలెత్తితే టోల్‌ఫ్రీ నంబర్ లేదా నేరుగా తన మొబైల్‌కు సమాచారం అందించాలని కోరారు.

గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నామని పీఓ తెలిపారు.

ఈ సమావేశంలో డీపీఆర్‌ఓ సంపత్‌కుమార్, ఉట్నూర్ ఏపీఆర్‌ఓ కార్యాలయ సిబ్బంది, ఏజెన్సీ మండలాల ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు పాల్గొన్నారు.