అలర్ట్… ఈ ప్రాంతాల్లో వర్షం.. !!
హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణలోని పలు జిల్లాల్లో వచ్చే కొన్ని గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, మేడ్చల్, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లో వచ్చే మూడు గంటల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది.
అలాగే వికారాబాద్, రంగారెడ్డి, సిద్ధిపేట, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, నల్గొండ, జనగామ, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, నిజామాబాద్, కొమురం భీమ్–ఆసిఫాబాద్ జిల్లాల్లో వచ్చే రెండు గంటల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
హైదరాబాద్‌లోనూ జల్లులు…
హైదరాబాద్‌లో ఉత్తర ప్రాంతాల్లో మధ్యాహ్నం తర్వాత నుంచి సాయంత్రం వరకు వర్షాలకు అనుకూల పరిస్థితులు నెలకొన్నాయని వాతావరణ నిపుణులు తెలిపారు. మేడ్చల్, షామీర్‌పేట్, బాచుపల్లి, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, కొంపల్లి ప్రాంతాల్లో ఇప్పటికే అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురుస్తుండగా, ఇవి ఉత్తర, పశ్చిమ హైదరాబాద్‌లోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందన్నారు. సాయంత్రం నగరంలోని పలు ప్రాంతాల్లో మేఘావృత వాతావరణంతో పాటు చెదురుమదురు జల్లులు కురిసే అవకాశముందని వెల్లడించారు.
అయితే, ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో ఈ ఏడాది వర్షపాతం గణనీయంగా తగ్గింది. రాష్ట్రవ్యాప్తంగా సాధారణంతో పోలిస్తే దాదాపు 40 శాతం వర్షపాతం లోటు నమోదైనట్లు వాతావరణ విశ్లేషణలు వెల్లడిస్తున్నాయి. వర్షాలు ఆలస్యంగా ప్రారంభం కావడంతో పాటు అనేక జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవడం వల్ల వ్యవసాయ కార్యకలాపాలపై ప్రభావం పడుతోంది.
జలాశయాల్లోకి ఆశించిన మేర నీటి ప్రవాహం లేకపోవడం సాగునీటి లభ్యతపై ఆందోళనలు పెంచుతోంది. అయితే బంగాళాఖాతంలో ఏర్పడే వాతావరణ వ్యవస్థలు, రుతుపవనాల చురుకుదనాన్ని బట్టి రానున్న రోజుల్లో రాష్ట్రంలో వర్షాలు ముమ్మరమయ్యే అవకాశముందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
