మరో ఐదు రోజుల్లో కామన్వెల్త్ గేమ్స్..
- గ్లాస్గోలో జూలై 23 నుంచి పోటీలు
ఆంధ్రప్రభ : ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2026 కామన్వెల్త్ క్రీడలు మరో ఐదు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. స్కాట్లాండ్‌లోని గ్లాస్గో నగరం ఈ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనుండగా… జూలై 23 నుంచి ఆగస్టు 2 వరకు పోటీలు జరగనున్నాయి. 2014 తర్వాత గ్లాస్గో రెండోసారి ఈ ప్రతిష్ఠాత్మక క్రీడలను నిర్వహించడం విశేషం. అయితే ఈసారి కామన్వెల్త్ క్రీడలు గత ఎడిషన్లతో పోలిస్తే పూర్తిగా భిన్నమైన పరిస్థితుల్లో జరుగుతున్నాయి. పరిమిత బడ్జెట్, తక్కువ క్రీడలు, తగ్గించిన వేదికలతో నిర్వహించనున్న ఈ క్రీడలు కామన్వెల్త్ చరిత్రలో ప్రత్యేక ఎడిషన్‌గా నిలవనున్నాయి.
తొలుత ఈ క్రీడలకు ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రం ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే నిర్వహణ వ్యయం ఊహించిన దానికంటే భారీగా పెరగడంతో విక్టోరియా ప్రభుత్వం ఆతిథ్యం నుంచి వైదొలిగింది. దీంతో కామన్వెల్త్ క్రీడల భవిష్యత్తుపై సందిగ్ధత నెలకొంది. చివరకు ఇప్పటికే విజయవంతంగా క్రీడలను నిర్వహించిన అనుభవం ఉన్న గ్లాస్గో ముందుకు వచ్చి, ఖర్చును తగ్గిస్తూ పరిమిత స్థాయిలో పోటీలను నిర్వహించేందుకు అంగీకరించింది. దీంతో నిర్వాహకులు క్రీడల సంఖ్యతో పాటు పోటీల నిర్వహణ వేదికలను కూడా గణనీయంగా తగ్గించారు.
19 క్రీడల నుంచి 10 క్రీడలకే పరిమితం
2022లో ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో మొత్తం 19 క్రీడలు నిర్వహించారు. కానీ ఈసారి కేవలం 10 క్రీడలకే పరిమితమయ్యాయి. అథ్లెటిక్స్, పారా అథ్లెటిక్స్, స్విమ్మింగ్, పారా స్విమ్మింగ్, 3×3 బాస్కెట్‌బాల్, వీల్‌చైర్ 3×3 బాస్కెట్‌బాల్, ట్రాక్ సైక్లింగ్, పారా ట్రాక్ సైక్లింగ్, ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్, బాక్సింగ్, జూడో, లాన్ బౌల్స్, పారా లాన్ బౌల్స్, నెట్‌బాల్, వెయిట్‌లిఫ్టింగ్, పారా పవర్‌లిఫ్టింగ్ విభాగాల్లో మాత్రమే పోటీలు జరగనున్నాయి.
మరోవైపు భారత్‌కు ఎన్నో పతకాలు అందించిన క్రికెట్, బ్యాడ్మింటన్, హాకీ, రెజ్లింగ్, టేబుల్ టెన్నిస్, స్క్వాష్, రగ్బీ సెవెన్స్, ట్రయాథ్లాన్, డైవింగ్, బీచ్ వాలీబాల్ వంటి ప్రముఖ క్రీడలను ఈసారి పూర్తిగా తొలగించారు. దీంతో భారత్‌తో పాటు పలు దేశాల పతకాల అవకాశాలపై కూడా ప్రభావం పడనుంది.
74 దేశాలు… 3 వేల మంది క్రీడాకారులు
ఈసారి కామన్వెల్త్ క్రీడల్లో సుమారు 74 కామన్వెల్త్ దేశాలు పాల్గొననున్నాయి. దాదాపు 3,000 మంది క్రీడాకారులు వివిధ విభాగాల్లో తమ ప్రతిభను చాటేందుకు సిద్ధమవుతున్నారు. క్రీడాకారులతో పాటు వందలాది మంది కోచ్‌లు, అధికారులు, సాంకేతిక నిపుణులు గ్లాస్గోకు చేరుకోనున్నారు.
ఈసారి భారత్ 191 మంది సభ్యులతో కూడిన బృందాన్ని గ్లాస్గోకు పంపుతోంది. ఇందులో 126 మంది క్రీడాకారులు ఉండగా, మిగిలిన వారు కోచ్‌లు, వైద్య సిబ్బంది, ఫిజియోలు, మేనేజర్లు, అధికారులు. భారత జట్టు ఎనిమిది సాధారణ క్రీడలు, ఐదు పారా విభాగాల్లో పోటీపడనుంది.
భారత బృందంలో అథ్లెటిక్స్‌కు అత్యధిక ప్రాధాన్యం లభించింది. ఈ విభాగంలో 32 మంది అథ్లెట్లు ఎంపికయ్యారు. ఆ తర్వాత బాక్సింగ్, జూడోలో తలా 14 మంది, వెయిట్‌లిఫ్టింగ్‌లో 12 మంది ప్రాతినిధ్యం వహించనున్నారు. స్విమ్మింగ్, ట్రాక్ సైక్లింగ్, లాన్ బౌల్స్, ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ విభాగాల్లోనూ భారత్ పోటీ ఇవ్వనుంది.
స్టార్లపై భారీ ఆశలు..
భారత్ తరఫున జావెలిన్ త్రోలో ఒలింపిక్, ప్రపంచ ఛాంపియన్ నీరజ్ చోప్రా ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాడు. అతనితో పాటు మురళీ శ్రీశంకర్, తజిందర్‌పాల్ సింగ్ తూర్, తేజస్విన్ శంకర్, జ్యోతి యర్రాజీ, పారుల్ చౌదరి, అన్నూ రాణి, శైలి సింగ్ వంటి అథ్లెట్లు కూడా పతకాల కోసం బరిలోకి దిగనున్నారు.
బాక్సింగ్‌లో టోక్యో ఒలింపిక్ కాంస్య పతక విజేత లవ్లీనా బోర్గొహైన్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆమెతో పాటు జాదుమణి సింగ్, హితేష్ గులియా, సచిన్ సివాచ్, ముస్కాన్, తమన్నా వంటి యువ బాక్సర్లు కూడా పతకాల వేటలో నిలవనున్నారు.
వెయిట్‌లిఫ్టింగ్‌లో ఒలింపిక్ రజత పతక విజేత మీరాబాయి చాను మరోసారి భారత్ ఆశలను మోస్తోంది. బింద్యారాణి దేవి, హర్జిందర్ కౌర్, జెరెమీ లాల్‌రిన్నుంగా, అచింత శెయులి వంటి వెయిట్‌లిఫ్టర్లు కూడా బలమైన పోటీదారులుగా భావిస్తున్నారు.
స్విమ్మింగ్‌లో శ్రీహరి నటరాజ్, సాజన్ ప్రకాష్, ధినిధి దేశింగు, హషికా రామచంద్ర, సైక్లింగ్‌లో ఈసో ఆల్బెన్, రొనాల్డో సింగ్, జూడోలో తులికా మాన్, యశ్ ఘంగాస్, జిమ్నాస్టిక్స్‌లో ప్రణతి నాయక్ వంటి క్రీడాకారులు కూడా భారత జట్టులో కీలక పాత్ర పోషించనున్నారు.
ఈ విభాగాల్లో భారత్ పోటీ
భారత్ 3×3 బాస్కెట్‌బాల్, వీల్‌చైర్ 3×3 బాస్కెట్‌బాల్, అథ్లెటిక్స్, పారా అథ్లెటిక్స్, బాక్సింగ్, జూడో, లాన్ బౌల్స్, స్విమ్మింగ్, పారా స్విమ్మింగ్, ట్రాక్ సైక్లింగ్, పారా ట్రాక్ సైక్లింగ్, ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్, వెయిట్‌లిఫ్టింగ్, పారా పవర్‌లిఫ్టింగ్ విభాగాల్లో తమ సత్తా చాటేందుకు సిద్ధమైంది. పారా క్రీడాకారుల నుంచి కూడా మంచి పతకాల ప్రదర్శనపై భారత క్రీడా వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
పతకాలపై ప్రభావం..
ఈసారి రెజ్లింగ్, బ్యాడ్మింటన్, క్రికెట్ వంటి భారత్‌కు అత్యధిక పతకాలు అందించే క్రీడలు లేకపోవడం వల్ల మొత్తం పతకాల పట్టికలో భారత్ స్థానం కొంత ప్రభావితమయ్యే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. అయినప్పటికీ అథ్లెటిక్స్, బాక్సింగ్, వెయిట్‌లిఫ్టింగ్, జూడో, పారా విభాగాల్లో భారత్ బలమైన పోటీ ఇవ్వగలదనే నమ్మకం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా నీరజ్ చోప్రా, మీరాబాయి చాను, లవ్లీనా బోర్గొహైన్, జ్యోతి యర్రాజీ, పారుల్ చౌదరి వంటి స్టార్ క్రీడాకారులు భారత పతకాల ఖాతాను మరింత బలోపేతం చేస్తారనే అంచనాలు ఉన్నాయి.
అహ్మదాబాద్‌లో శతాబ్ది కామన్వెల్త్ క్రీడలు
ఇక 2030 కామన్వెల్త్ క్రీడలకు భారత్‌లోని అహ్మదాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. కామన్వెల్త్ క్రీడలు ప్రారంభమై 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా జరిగే శతాబ్ది ఎడిషన్‌కు భారత్ ఆతిథ్యం దక్కడం దేశ క్రీడా చరిత్రలో మరో కీలక ఘట్టంగా నిలవనుంది. ఈ క్రీడల ద్వారా ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, నిర్వహణ సామర్థ్యాన్ని భారత్ మరోసారి చాటుకునే అవకాశంగా క్రీడా వర్గాలు భావిస్తున్నాయి.
