Bulkampet Ellamma Kalyanam 2026 | 21న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం
పటిష్ట ఏర్పాట్లు చేయాలి: తలసాని
భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి
తాగునీరు, పారిశుద్ధ్యం, ట్రాఫిక్, భద్రతపై అధికారులకు సూచనలు
Bulkampet Ellamma Kalyanam 2026 | ఆంధ్ర్రప్రభ వెబ్‌డెస్క్ : బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం, రథోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 21న జరగనున్న అమ్మవారి కళ్యాణం, 22న నిర్వహించనున్న రథోత్సవం ఏర్పాట్లపై శనివారం బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద వివిధ శాఖల అధికారులతో తలసాని సమీక్ష సమావేశం నిర్వహించారు. లక్షలాది మంది భక్తులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా తరలివచ్చే అవకాశం ఉన్నందున అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
భక్తుల కోసం తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ సరఫరా, వైద్య సదుపాయాలు, ట్రాఫిక్ నియంత్రణ, భద్రత వంటి అంశాల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు ఆనందంగా నిర్వహించుకునే వేడుకల్లో అనవసర ఇబ్బందులు కలిగించే విధంగా ఆంక్షలు ఉండకూడదని సూచించారు. ఆలయ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా అదనపు పారిశుద్ధ్య సిబ్బందిని నియమించి నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని అన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పటిష్టమైన బారికేడ్లు, క్యూ లైన్ల ఏర్పాట్లు చేయాలని సూచించారు.

ఆలయం పరిసరాల్లో రోడ్ల మరమ్మతులు అవసరమైతే వెంటనే చేపట్టాలని డీసీ సుజాతను ఆదేశించారు. డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైన ప్రాంతాల్లో లైటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. కళ్యాణం, రథోత్సవం సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణకు అదనపు పోలీసు బలగాలను ఏర్పాటు చేయాలని, అవసరమైన చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. రథోత్సవం సమయంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.

క్యూ లైన్లలో వేచి ఉండే భక్తులకు తాగునీరు అందించేలా ఏర్పాట్లు చేయాలని, విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు. ఆలయ పరిసరాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు భక్తులకు సేవలందించే వాలంటీర్లకు గుర్తింపు కార్డులు అందించాలని సూచించారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత బల్కంపేట ఎల్లమ్మ ఆలయ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో వారికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు.
గతంలో అమ్మవారి కళ్యాణానికి సుమారు 20 వేల మంది భక్తులు హాజరయ్యేవారని, ప్రస్తుతం భక్తుల సంఖ్య 7 నుంచి 8 లక్షల వరకు పెరిగిందని తెలిపారు. ప్రతి వారం పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి వస్తున్న నేపథ్యంలో వారి విశ్వాసానికి అనుగుణంగా సౌకర్యాలు మెరుగుపరచాలని అధికారులను కోరారు. ఈ సమావేశంలో ఆలయ ఈఓ వినోద్ రెడ్డి, డీసీ సుజాత, వాటర్ వర్క్స్ జీఎం సతీష్, విద్యుత్ శాఖ డీఈ కిషోర్, ఆర్‌అండ్‌బీ డీఈ మనోహర్, లా అండ్ ఆర్డర్ సీఐ శ్రీనివాస్ రెడ్డి, ట్రాఫిక్ సీఐ మహేష్, స్ట్రీట్ లైట్ డీఈ మహేష్, రెవెన్యూ అధికారి సుధీర్ తదితరులు పాల్గొన్నారు.

