అప్పటికి ఇప్పటికీ ఏం మారింది…

  • కరోనా తర్వాత ఏం మారింది..
  • జీవితాల్లో వచ్చిన 5 డిజిటల్ మార్పులివే!

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: ఒకప్పుడు ప్రపంచాన్ని స్తంభింపజేసిన కరోనా మహమ్మారి పేరు మరోసారి వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో గత 20 రోజుల వ్యవధిలో 12 కరోనా కేసులు నమోదవడంతో ప్రజల్లో కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే, ఇది 2020లో కనిపించిన పరిస్థితి కాదని, భయపడాల్సిన అవసరం లేదని, అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య శాఖ స్పష్టం చేసింది.

ఈ మేర‌కు వైద్యారోగ్య శాఖ కార్యదర్శి వీరపాండియన్ తాజా వివ‌రాలు వెల్లడించారు. జూన్ 26 నుంచి జులై 16 వరకు కడప జిల్లాలో 8, గుంటూరులో 2, విశాఖపట్నం, కాకినాడ జిల్లాల్లో ఒక్కో కరోనా కేసు నమోదయ్యాయి. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నలుగురు మరణించినట్లు తెలిపారు. వైరస్ స్వరూపాన్ని గుర్తించేందుకు నమూనాలను పుణెలోని ప్రయోగశాలకు జన్యుక్రమ విశ్లేషణ కోసం పంపించారు.

ప్రస్తుతం నమోదవుతున్న కేసుల సంఖ్య చాలా పరిమితంగా ఉందని, ఎక్కువ మంది స్వల్ప లక్షణాలతోనే కోలుకుంటున్నారని వైద్యారోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. టీకాలు, సహజ రోగనిరోధక శక్తి కారణంగా వైరస్ తీవ్రత గతంతో పోలిస్తే గణనీయంగా తగ్గిందని పేర్కొంటున్నారు. అయితే వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు మాత్రం జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.

కరోనా తర్వాత మారిపోయిన ప్రపంచం..

కరోనా మహమ్మారి ఆరోగ్య సంక్షోభాన్ని తీసుకురావ‌డం మాత్రమే కాదు.. మన జీవనశైలినీ పూర్తిగా మార్చేసింది. ఐదేళ్లలో డిజిటల్ ప్రపంచం మన రోజువారీ జీవితంలో అంతర్భాగంగా మారిపోయింది. ఒకప్పుడు ఏ చిన్న సందేహం వచ్చినా వెంటనే గూగుల్‌లో వెతికేవాళ్లం. ఇప్పుడు పరిస్థితి మారుతోంది. ప్రశ్న అడిగితే నేరుగా సమాధానం చెప్పే చాట్‌జీపీటీ వంటి ఆర్టిఫిషియ‌ల్ ఇంట‌లిజెన్స్ మోడ‌ల్స్ వైపు వినియోగదారులు మొగ్గు చూపుతున్నారు. విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకు.. రచయితల నుంచి వ్యాపారవేత్తల వరకు కృత్రిమ మేధస్సును ఉపయోగించే వారి సంఖ్య పెరుగుతోంది. ఒక అంశాన్ని వివరంగా తెలుసుకోవడం, సమాచారం సారాంశం పొందడం, కొత్త ఆలోచనలు వెతకడం వంటి అవసరాలకు ఏఐని విరివిరిగా ఉపయోగపడుతున్నాయి.

వార్తలకు కొత్త చిరునామా

ఒకప్పుడు ఉదయం పేపర్ చదవడం, బ్రేకింగ్ న్యూస్ కోసం టెలివిజన్ ముందు కూర్చోవడం చాలామందికి రోజువారీ అలవాటు. రాష్ట్రంలో ఏమి జరిగింది.. దేశంలో ఏం జరుగుతోంది.. ప్రపంచంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయో తెలుసుకోవాలంటే టీవీ ఛానళ్లపైనే ఎక్కువగా ఆధారపడేవారు. సోష‌ల్ మీడియా అప్పటికే ఉన్నప్పటికీ, వాటి వినియోగం పరిమితంగానే ఉండేది.

అయితే, కరోనా సమయంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇంటికే పరిమితమైన ప్రజలు సమాచారం కోసం పెద్దఎత్తున సామాజిక మాధ్యమాలను ఆశ్రయించారు. ఆ సమయంలో ఎక్స్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, టెలిగ్రామ్, వాట్సాప్ వంటి వేదికల వినియోగం గణనీయంగా పెరిగింది. ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు, అధికారులు, క్రీడాకారులు, ప్రముఖులు కూడా తమ ప్రకటనలను నేరుగా ఈ వేదికల ద్వారానే వెల్లడించడం ప్రారంభించారు.

దీంతో వార్తలు టెలివిజన్ కంటే ముందే ప్రజల చేతుల్లోకి చేరుతున్నాయి. అధికారిక ప్రకటన వెలువడిన కొన్ని క్షణాల్లోనే అది ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తోంది. ఘటనలు ప్రత్యక్ష ప్రసారాల రూపంలో అందుబాటులోకి వస్తుండటంతో ప్రజలు కూడా టీవీ కంటే మొబైల్ ఫోన్‌పైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. కొత్త తరం మాత్రమే కాదు.. అన్ని వయసులవారూ కాలానికి అనుగుణంగా మారి డిజిటల్ ప్రపంచానికి అలవాటు పడ్డారు. కరోనా తర్వాత వార్తల ప్రపంచానికి సామాజిక మాధ్యమాలే కొత్త చిరునామాగా మారాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

యూట్యూబ్.. కొత్త తరం టెలివిజన్

ఒకప్పుడు వినోదం అంటే టెలివిజన్ మాత్రమే. ఇష్టమైన ప్రోగ్రామ్ చూడాలంటే అది ప్రసారమయ్యే సమయానికి టీవీ ముందు ఉండాల్సిందే. కానీ కరోనా తర్వాత ఈ అలవాటు పూర్తిగా మారిపోయింది. ఇంటికే పరిమితమైన రోజుల్లో యూట్యూబ్ వినియోగం భారీగా పెరిగింది. టెలివిజన్‌కు పరిమితమైన వినోదం క్రమంగా మొబైల్ ఫోన్‌లోకి చేరిపోయింది.

ఇప్పుడు వార్తలు, సినిమాలు, వెబ్ ప్రోగ్రామ్‌లు, విద్యాపరమైన పాఠాలు, వంటలు, ప్రయాణ వీడియోలు, ముఖాముఖీలు, పాడ్‌కాస్ట్‌లు, ప్రత్యక్ష ప్రసారాలు.. ఇలా ఏది కావాలన్నా యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది. ముఖ్యంగా ప్రేక్షకుడు తనకు నచ్చిన కార్యక్రమాన్ని, తనకు అనుకూలమైన సమయంలో చూసే వెసులుబాటు ఉండటంతో యూట్యూబ్ కోట్లాది మంది జీవితంలో భాగమైంది.

కొత్త తరంతో పాటు పెద్దలు కూడా టెలివిజన్ కంటే మొబైల్‌నే ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఒకప్పుడు చేతిలో రిమోట్ ఉండేది.. ఇప్పుడు అదే స్థానాన్ని స్మార్ట్‌ఫోన్ ఆక్రమించింది. దీంతో సంప్రదాయ టెలివిజన్ వీక్షణకు యూట్యూబ్ గట్టి పోటీగా నిలిచి, వినోద ప్రపంచానికే కొత్త రూపాన్ని తీసుకొచ్చింది.

ఓటీటీతో సినిమా వీక్షణలో విప్లవం..

ఒకప్పుడు కొత్త సినిమా చూడాలంటే థియేటర్‌కు వెళ్లడం ఒక్కటే మార్గం. టికెట్ కోసం క్యూలో నిలబడటం, షో టైమ్‌కు వెళ్లే వాళ్లం.. కానీ కరోనా సమయంలో థియేటర్లు మూతపడటంతో ఓటీటీ వేదికల వినియోగం ఒక్కసారిగా పెరిగింది. అప్పటి వరకు ప్రత్యామ్నాయంగా ఉన్న ఓటీటీలు.. కరోనా తర్వాత ప్రధాన వినోద వేదికలుగా మారిపోయాయి.

ఇప్పుడు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు, డాక్యుమెంటరీలు, ప్రత్యేక కార్యక్రమాలు నేరుగా ఓటీటీల్లోనే విడుదలవుతున్నాయి. టీవీ, మొబైల్, ట్యాబ్, ల్యాప్‌టాప్.. ఏ పరికరంలోనైనా, ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసే స్వేచ్ఛ ప్రేక్షకుడికి లభించింది. ఒకే సారి మొత్తం సిరీస్‌ను చూడడం, మధ్యలో ఆపి మళ్లీ కొనసాగించడం వంటి సౌకర్యాలు కూడా ఓటీటీలకు మరింత ఆదరణ తీసుకొచ్చాయి.

అయితే థియేటర్ల ప్రాధాన్యం పూర్తిగా తగ్గిపోలేదు. భారీ బడ్జెట్ చిత్రాలు, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్, పెద్ద తెరపై సినిమా చూసే అనుభూతి కోసం ఇప్పటికీ ప్రేక్షకులు థియేటర్లకే వెళ్తున్నారు. అంటే థియేటర్ కనుమరుగవలేదు.. కానీ కరోనా తర్వాత ప్రేక్షకుడికి మరో బలమైన ప్రత్యామ్నాయంగా ఓటీటీలు స్థిరపడ్డాయి.

ఇంటి గుమ్మం వద్దకే మార్కెట్..

కిరాణా సరుకులు కొనాలంటే తప్పనిసరిగా సంచి పట్టుకుని దుకాణానికి వెళ్లాల్సి వచ్చేది. నెలకు ఒకసారి పెద్ద జాబితాతో మార్కెట్‌కు వెళ్లి సరుకులు కొనడం చాలా కుటుంబాల్లో సాధారణం. కానీ కరోనా సమయంలో బయటకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఇంటికే సరుకులు తెప్పించుకునే అలవాటు వేగంగా పెరిగింది.

ఇప్పుడు మొబైల్‌లో కొన్ని బటన్లు నొక్కితే చాలు.. పాలు, కూరగాయలు, పండ్లు, మందులు, కిరాణా వస్తువులు, చిన్న ఎలక్ట్రానిక్ పరికరాలు.. ఇలా దాదాపు అన్నీ ఇంటి గుమ్మం వద్దకే చేరుతున్నాయి. కొన్ని నగరాల్లో అయితే 10 నుంచి 20 నిమిషాల్లోనే సరుకులు అందించే వేగవంతమైన వాణిజ్య సేవలు విస్తరించాయి.

దీంతో ముందుగానే నెలవారీ సరుకులు కొనుగోలు చేసే అలవాటు క్రమంగా తగ్గుతోంది. అవసరం వచ్చినప్పుడల్లా వెంటనే మొబైల్‌లో ఆర్డర్ చేసి ఇంటికే తెప్పించుకునే కొత్త కొనుగోలు సంస్కృతి ఏర్పడింది. కరోనా తర్వాత డిజిటల్ వాణిజ్యం విస్తరించడంతో మార్కెట్‌నే ఇంటి గుమ్మం వద్దకు తీసుకొచ్చినట్లయింది.

డిజిటల్ చెల్లింపులు.. కొత్త అలవాటు

కరోనా సమయంలో నగదు లావాదేవీలపై ప్రజలు అప్రమత్తం కావడంతో డిజిటల్ చెల్లింపుల వినియోగం ఒక్కసారిగా పెరిగింది. యూపీఐ, క్యూ ఆర్ కోడ్ ఆధారిత చెల్లింపులు ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించాయి. చిన్న టీ దుకాణం నుంచి కూరగాయల మార్కెట్, పెద్ద షాపింగ్ మాల్స్ వరకు దాదాపు ప్రతి చోటా డిజిటల్ చెల్లింపులే ప్రధాన మార్గంగా మారాయి. మొబైల్ ఫోన్ ఉంటే చాలు.. క్షణాల్లో లావాదేవీలు పూర్తయ్యే పరిస్థితి ఏర్పడింది.

ఇంటి నుంచే పని.. ఆన్‌లైన్ విద్య

కరోనా సమయంలో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రారంభమైన ఇంటి నుంచే పని చేసే విధానం ఇప్పుడు అనేక సంస్థల్లో శాశ్వత విధానంగా మారింది. ఉద్యోగ సమావేశాలు వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారానే జరుగుతుండగా, విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు, వైద్యులను వీడియో కాల్ ద్వారా సంప్రదించే టెలిమెడిసిన్ సేవలు కూడా విస్తృతంగా అందుబాటులోకి వచ్చాయి. దీంతో పని, విద్య, వైద్య సేవల్లో డిజిటల్ వినియోగం గణనీయంగా పెరిగింది.

పరిశుభ్రతపై పెరిగిన అవగాహన

కరోనా మహమ్మారి తగ్గిపోయినా అది నేర్పిన పరిశుభ్రత అలవాట్లు మాత్రం చాలామందిలో కొనసాగుతున్నాయి. చేతులు తరచూ శుభ్రం చేసుకోవడం, అనారోగ్య లక్షణాలు ఉంటే మాస్క్ ధరించడం, రద్దీ ప్రదేశాల్లో జాగ్రత్తలు తీసుకోవడం వంటి అలవాట్లు రోజువారీ జీవితంలో భాగమయ్యాయి. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు ప్రజారోగ్యంపై కూడా గతంతో పోలిస్తే ప్రజల్లో అవగాహన గణనీయంగా పెరిగింది.

జాగ్రత్త అవసరం.. భయం కాదు

ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా నమోదవుతున్న కరోనా కేసులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి. అయితే 2020 నాటి పరిస్థితులతో పోలిస్తే ఇప్పుడు వైద్య వ్యవస్థ మరింత బలోపేతమైంది. టీకాలు, మెరుగైన చికిత్సా విధానాలు, ప్రజల్లో పెరిగిన అవగాహన వల్ల వైరస్ ప్రభావం గణనీయంగా తగ్గింది. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, శ్వాస సంబంధిత సమస్యలు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం, అవసరమైన పరీక్షలు చేయించుకోవడం, వృద్ధులు మరియు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

కరోనా ప్రపంచాన్ని ఒక్కసారిగా మార్చేసింది. కానీ అది తెచ్చిన మార్పులు మాత్రం తాత్కాలికం కాలేదు. డిజిటల్ చెల్లింపులు, ఇంటి నుంచే పని, ఆన్‌లైన్ విద్య, ఇంటి వద్దకే సేవలు, పరిశుభ్రతపై అవగాహన వంటి ఎన్నో కొత్త అలవాట్లు ఇప్పుడు మన జీవితంలో విడదీయరాని భాగంగా మారాయి. కరోనా తగ్గిపోయినా… అది నేర్పిన పాఠాలు, మన జీవనశైలిలో తీసుకొచ్చిన మార్పులు మాత్రం ఇంకా మనతోనే కొనసాగుతున్నాయి.