Breaking | విక్రమ్-1 రాకెట్ ప్రయోగం వాయిదా..

సాంకేతిక లోపంతో నిలిచిన కౌంట్‌డౌన్


ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి ప్రయోగించాల్సిన ‘విక్రమ్-1’ రాకెట్ ప్రయోగం సాంకేతిక కారణాలతో తాత్కాలికంగా వాయిదా పడింది. హైదరాబాద్‌కు చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ రాకెట్‌ను అభివృద్ధి చేసింది.

శనివారం ఉదయం 6 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. అయితే, ప్రయోగానికి ముందు రాకెట్ వ్యవస్థలను తుది దశలో పరిశీలిస్తున్న సమయంలో శాస్త్రవేత్తలు సాంకేతిక లోపాన్ని గుర్తించారు. భద్రతా ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని ప్రయోగాన్ని నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.

సుమారు 350 కిలోల బరువున్న చిన్న ఉపగ్రహాలను భూ నిమ్న కక్ష్య (లో ఎర్త్ ఆర్బిట్) లోకి ప్రవేశపెట్టే సామర్థ్యంతో విక్రమ్-1 రాకెట్‌ను రూపొందించారు. వాణిజ్య ఉపగ్రహ ప్రయోగాల మార్కెట్‌లో భారత ప్రైవేట్ అంతరిక్ష రంగానికి ఇది కీలక మైలురాయిగా భావిస్తున్నారు.

ఈ ప్రయోగం విజయవంతమైతే భారత అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థల పాత్ర మరింత బలోపేతం కానుంది. ప్రస్తుతం గుర్తించిన సాంకేతిక సమస్యను పరిష్కరించే పనిలో స్కైరూట్ ఏరోస్పేస్, ఇస్రో శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారు. సమస్య పూర్తిగా పరిష్కారమైన అనంతరం తదుపరి ప్రయోగ తేదీని అధికారికంగా ప్రకటించనున్నారు.