KTR Challenge | “70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా
కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు
సరూర్‌నగర్ యువ సంగ్రామ సదస్సులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆరోపణలు
జాబ్ క్యాలెండర్, నిరుద్యోగుల హామీలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కేటీఆర్
KTR Challenge | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : హైదరాబాద్ సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో బీఆర్ఎస్ నిర్వహించిన యువ సంగ్రామ సదస్సులో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 70 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పడంపై కేటీఆర్ స్పందిస్తూ.. అవి బీఆర్ఎస్ హయాంలో ప్రారంభమైన నియామక ప్రక్రియలకు సంబంధించినవని ఆరోపించారు. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు నిరూపిస్తే తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను గుర్తు చేసిన కేటీఆర్.. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని జాబ్ క్యాలెండర్ ప్రకటించారని, ఆ హామీ అమలు కాలేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ.. మాటలకు, హామీలకు మధ్య వ్యత్యాసం ఉందని అన్నారు. ఉద్యోగాల భర్తీపై యువత ఎదురుచూస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపించారు. ఉద్యోగాల కోసం పోరాడుతున్న యువత సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కేటీఆర్ అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులపై చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. యువతను అవమానించేలా మాట్లాడటం సరికాదని విమర్శించారు. యువత సమస్యలపై బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని, నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు తమ గళాన్ని వినిపిస్తామని కేటీఆర్ తెలిపారు.
