Breaking |నింగిలోకి దూసుకెళ్లిన విక్రమ్-1
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : దేశంలోనే పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో ప్రైవేట్ సంస్థ రూపొందించిన విక్రమ్-1 రాకెట్ శనివారం విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. హైదరాబాద్‌కు చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన ఈ రాకెట్ ప్రయోగం భారత అంతరిక్ష రంగంలో మరో కీలక మైలురాయిగా నిలిచింది.
శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఉదయం 11.30 గంటలకు ప్రయోగం జరగాల్సి ఉండగా, కౌంట్‌డౌన్ సమయంలో గుర్తించిన సాంకేతిక సమస్యల కారణంగా దాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. అనంతరం శాస్త్రవేత్తలు లోపాలను విజయవంతంగా పరిష్కరించడంతో సుమారు 35 నిమిషాల ఆలస్యంగా రాకెట్‌ను ప్రయోగించారు.
ఈ మిషన్‌లో భాగంగా ‘మిషన్ ఆగమన్’ పేరిట ప్రత్యేక పేలోడ్‌తో పాటు విక్రమ్-1 రూపకర్తల సంతకాలను కూడా అంతరిక్షంలోకి పంపడం విశేషంగా నిలిచింది. చిన్న ఉపగ్రహాలను భూ నిమ్న కక్ష్యలోకి చేర్చేందుకు రూపొందించిన ఈ రాకెట్ భారత ప్రైవేట్ అంతరిక్ష రంగ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విక్రమ్-1 విజయవంతమైన ప్రయోగంతో భారత అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యానికి కొత్త ఊపు లభించనుందని భావిస్తున్నారు.
