KTR Youth Sabha | యువత కదం తొక్కితే మార్పు తప్పదు: కేటీఆర్
కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు
సరూర్‌నగర్ స్టేడియం వేదికగా బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సు
యువత సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
KTR Youth Sabha | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : హైదరాబాద్ సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో బీఆర్ఎస్ నిర్వహించిన యువ సంగ్రామ సదస్సులో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. యువతలో ఉన్న ఆగ్రహం, ఆశయాలను ప్రతిబింబించేలా ఈ సదస్సు నిర్వహిస్తున్నామని పేర్కొన్న ఆయన.. “ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇకపై మరో లెక్క” అంటూ ప్రభుత్వంపై రాజకీయ పోరాటానికి సంకేతాలు ఇచ్చారు.
కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపిస్తూ.. అదే సరూర్‌నగర్ వేదికగా యువతకు న్యాయం కోసం తమ పోరాటాన్ని ప్రారంభిస్తున్నామని కేటీఆర్ అన్నారు. యువత కదం తొక్కితే ఉద్యమాలు ఉప్పెనలుగా మారుతాయని, రేపటి తెలంగాణ నిర్మాతలు యువతేనని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ ప్రకటించిన యూత్ డిక్లరేషన్‌పై విమర్శలు చేసిన కేటీఆర్.. హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్ అంశాల్లో యువతను మోసం చేశారని అన్నారు. “నోటిఫికేషన్లకు బదులు లూటిఫికేషన్లు జరుగుతున్నాయి” అంటూ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.
రాహుల్ గాంధీ అశోక్‌నగర్‌లో ఇచ్చిన హామీలను గుర్తు చేసిన కేటీఆర్.. ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్ ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. కొలువుల కోసం ప్రశ్నిస్తున్న యువతపై కేసులు, నిర్బంధాలు పెట్టడం సరికాదని అన్నారు.
యువత ఐక్యంగా నిలిస్తే ప్రభుత్వాలు మారుతాయని పేర్కొన్న కేటీఆర్.. యువత సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు.
