AP | ఏటీసీ టవర్‌–కమ్‌–టెక్నికల్‌ బ్లాక్‌ ప్రారంభం..

విమాన రాకపోకల నిర్వహణకు అత్యాధునిక సాంకేతిక వసతులు
నూతన టెర్మినల్‌ పనులు పరిశీలించిన కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు
దసరా నాటికి టెర్మినల్‌ అందుబాటులోకి తేవాలి: ఎంపీ కేశినేని చిన్ని
ఆగస్టు 13 నుంచి వారణాసి, కోల్‌కతాకు విమాన సర్వీసులు
కొచ్చిన్‌ సర్వీసు ప్రారంభించాలి..
కేంద్ర మంత్రికి ఎంపీ విజ్ఞప్తి
విజయవాడ, జులై 18:( ఆంధ్రప్రభ): విజయవాడ విమానాశ్రయంలో విమాన రాకపోకల నిర్వహణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక ముందడుగు పడింది. గన్నవరం విమానాశ్రయంలో నూతనంగా నిర్మించిన ఏటీసీ టవర్‌–కమ్‌–టెక్నికల్‌ బ్లాక్‌ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్‌నాయుడు శనివారం ప్రారంభించారు. కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని), మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి పాల్గొన్నారు. కొత్త ఏటీసీ టవర్‌–కమ్‌–టెక్నికల్‌ బ్లాక్‌లో ఎయిర్‌ ట్రాఫిక్‌ సర్వీసెస్‌ (ఏటీఎస్‌), కమ్యూనికేషన్‌, నావిగేషన్‌, సర్వైలెన్స్‌ (సీఎన్‌ఎస్‌) సహా ఇతర అనుబంధ సాంకేతిక కార్యకలాపాలకు అవసరమైన ఆధునిక మౌలిక వసతులు, అధునాతన వ్యవస్థలు అందుబాటులోకి రానున్నాయి. దీనివల్ల విమానాశ్రయంలో విమాన రాకపోకల నిర్వహణ మరింత సురక్షితంగా, సమర్థంగా సాగేందుకు అవకాశం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు. సాంకేతిక సేవల మధ్య సమన్వయం మెరుగుపడటంతో పాటు భవిష్యత్‌లో పెరగనున్న విమాన రాకపోకలకు అనుగుణంగా విమానాశ్రయం మరింత మెరుగైన సామర్థ్యంతో పనిచేయనుంది.

నూతన టెర్మినల్‌ పనుల పరిశీలన…

అనంతరం నిర్మాణంలో ఉన్న నూతన టెర్మినల్‌ భవనాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు, ఎంపీ కేశినేని చిన్ని పరిశీలించారు. పనులు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి కార్మికులు, సిబ్బందితో మాట్లాడి నిర్మాణ పురోగతిని అడిగి తెలుసుకున్నారు. టెర్మినల్‌ నిర్మాణ పనులను వేగవంతం చేసి వీలైనంత త్వరగా ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను సూచించారు.

అంతర్జాతీయ కనెక్టివిటీకి మరింత ఊతం…

ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ.. విజయవాడ విమానాశ్రయానికి ఇది శుభదినమని పేర్కొన్నారు. ఏటీసీ టవర్‌–కమ్‌–టెక్నికల్‌ బ్లాక్‌ ప్రారంభంతో పాటు విమాన కనెక్టివిటీ కూడా క్రమంగా పెరుగుతోందన్నారు. ఢిల్లీతో పాటు హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు, ముంబై నగరాలకు విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. ఆగస్టు 13 నుంచి వారణాసి, కోల్‌కతా సర్వీసులు ప్రారంభం కానుండటం సంతోషకరమన్నారు. నూతన టెర్మినల్‌ను దసరా నాటికి అందుబాటులోకి తీసుకువచ్చి ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించాలని కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడిని కోరినట్లు చిన్ని తెలిపారు. శబరిమలై వెళ్లే భక్తుల సౌకర్యార్థం కొచ్చిన్‌కు విమాన సర్వీసు ప్రారంభించాలని కూడా కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో కేవీకే ప్రాజెక్ట్స్‌ ప్రతినిధులు, విమానాశ్రయ డైరెక్టర్‌, ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.