ఘన వ్యర్థాల నిర్వహణకు ప్రభుత్వం పెద్దపీట..
నంద్యాల ప్రతినిధి, ఆంధ్రప్రభ ; రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న “స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమంలో భాగంగా శనివారం కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపాలిటీ పరిధిలోని ఎన్టీఆర్ స్టేడియం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ విధానంలో రాష్ట్రవ్యాప్తంగా డ్రై ఘన వ్యర్థాలను సంపద సృష్టి కేంద్రాలుగా తీర్చిదిద్దే కార్యక్రమానికి శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని నంద్యాల జిల్లా బేతంచెర్ల నగర పంచాయతీ నుంచి జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానికులతో కలిసి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు.
అనంతరం బేతంచెర్ల నగర పంచాయతీలో రూ.91 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన సమీకృత ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గారు సంయుక్తంగా ప్రారంభించారు. రోజుకు 10 టన్నుల తడి, పొడి ఘన వ్యర్థాలను శాస్త్రీయంగా ప్రాసెస్ చేసే సామర్థ్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డ్రై వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్ యంత్రాన్ని కలెక్టర్ స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణతో పాటు ఘన వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించి వాటిని సంపదగా మార్చడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
చెత్తను సమస్యగా కాకుండా విలువైన వనరుగా భావించి, రీసైక్లింగ్, ప్రాసెసింగ్ ద్వారా ఆదాయ వనరులను సృష్టించే దిశగా ప్రభుత్వం వినూత్న చర్యలు చేపడుతోందన్నారు. ఇటువంటి సమీకృత ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాలు పరిశుభ్రమైన పట్టణాల నిర్మాణానికి, పర్యావరణ పరిరక్షణకు, స్థానిక సంస్థల ఆదాయ వృద్ధికి ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు.జిల్లా, మండల స్థాయి యంత్రాంగాలు ఘన వ్యర్థాల నిర్వహణను మరింత సమర్థవంతంగా అమలు చేసి, వ్యర్థాలను సంపదగా మలిచే దిశగా కృషి చేస్తున్నాయని కలెక్టర్ తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన “స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” లక్ష్యాలను సాధించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. బేతంచెర్లను అన్ని విధాలా అభివృద్ధి చేసి ఆదర్శ నగర పంచాయతీగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని, పట్టణ అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా కొనసాగుతున్నాయని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డోన్ ఆర్డీఓ నరసింహులు, బేతంచెర్ల నగర పంచాయతీ కమిషనర్ హరిప్రసాద్, బేతంచెర్ల మండల తహసీల్దార్ నాగమణి, సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
