మెక్సికోలో భారీ భూకంపం
- గ్వాటెమాలా సరిహద్దు సమీపంలో భారీ ప్రకంపనలు..
- మెక్సికో, ఎల్ సాల్వడార్‌లోనూ కంపించిన భూమి
ఆంధ్రప్రభ : మెక్సికో దక్షిణ పసిఫిక్ తీరంలో శుక్రవారం రిక్టర్ స్కేలుపై 7.3 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. గ్వాటెమాలా సరిహద్దుకు సమీపంలోని చియాపాస్ రాష్ట్ర తీర ప్రాంతంలో భూకంప కేంద్రం నమోదవడంతో దక్షిణ మెక్సికోతో పాటు గ్వాటెమాలా, ఎల్ సాల్వడార్ దేశాల్లో కూడా బలమైన ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.

అమెరికా భూకంప పరిశోధనా సంస్థ (యూఎస్‌జీఎస్) తెలిపిన వివరాల ప్రకారం, చియాపాస్ రాష్ట్ర తీరంలోని అక్విలెస్ సెర్డాన్‌కు నైరుతి దిశగా సుమారు 48 కిలోమీటర్ల దూరంలో, భూమికి 15 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైంది. ప్రధాన భూకంపానికి కొద్దిసేపటి ముందు పసిఫిక్ మహాసముద్రంలో మరో స్వల్ప తీవ్రత గల భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు.
భూకంప ప్రభావంతో వందల కిలోమీటర్ల దూరంలోని మెక్సికో సిటీలోనూ ప్రకంపనలు స్పష్టంగా అనిపించాయి. పొరుగు దేశమైన ఎల్ సాల్వడార్‌లో కూడా ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఇప్పటివరకు భారీ ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు. భూకంప ప్రభావాన్ని అంచనా వేస్తూ అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, అత్యవసర సహాయ బృందాలు అప్రమత్తంగా ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

