School reopening | పాఠశాలల్లో పండుగ వాతావరణం
School reopening | పాఠశాలల్లో పండుగ వాతావరణం
School reopening | రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల హాజరు
పాఠ్యపుస్తకాల పంపిణీలో రికార్డు
గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక స్వాగత కార్యక్రమాలు
విద్యాశాఖ మంత్రి లోకేష్ శుభాకాంక్షలు
School reopening | అమరావతి, ఆంధ్రప్రభ: సుదీర్ఘ వేసవి సెలవుల అనంతరం బడిగంట మోగింది. పాఠశాలలు తలుపులు మళ్లీ తెరుచుకోవడంతో తరగతులు పునఃప్రారంభమయ్యాయి. దీంతో తొలిరోజు పండుగ వాతావరణంలో ఆహ్లాదంగా పిల్లలు స్కూళ్లకు పరుగులు తీశారు. ఈ సంవత్సరం కొత్తగా అడ్మిషన్ పొందిన విద్యార్థులు తొలిసారిగా బడిలో అడుగు పెట్టగా, తోటి పిల్లలకు చాక్లెట్లు పంచారు. వారికి ఆహ్వానం పలుకుతూ టీచర్లు మిఠాయిలు అందించడం మరింత ఆహ్లాదాన్ని పంచింది. ఇక కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో విద్యాశాఖ మంత్రి లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా 2026–27 విద్యా సంవత్సరం తొలి రోజే బడులకు పిల్లలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కర్నూలులో కొత్తగా బడికి వచ్చిన చిన్నారులను ఉపాధ్యాయులు ఆటపాటలతో ఆహ్వానించారు. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల పునఃప్రారంభం పండుగ వాతావరణంలో జరిగింది. నంద్యాలకు చెందిన సేవా సంస్థ “మన ఊరు – మన బడి – మన బాధ్యత” పేరిట బాలికలకు స్వాగతం పలికింది. డ్రమ్ములు వాయిస్తూ విద్యార్థులతో కలిసి టీచర్లు నృత్యం చేశారు.
కొత్త విద్యా సంవత్సరం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 45 వేల ప్రభుత్వ పాఠశాలలు, 44 వేల ప్రైవేటు పాఠశాలలు నేడు తిరిగి ప్రారంభమయ్యాయి. మొదటి రోజునే విద్యార్థులకు ఆహ్వానం పలికేందుకు పాఠశాల యాజమాన్యాలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు కొత్త విద్యా సంవత్సరంపై ఆశావహంగా ఉన్నారు.
రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా
రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికే పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలను వంద శాతం పాఠశాలలకు ప్రభుత్వం చేరవేసింది. దీంతో మొదటి రోజునుంచే విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రి మొత్తం అందుబాటులోకి వచ్చింది. పుస్తకాల పంపిణీ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
బాజా బజంత్రీలతో పాఠశాలకు
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా తొలిరోజు బడులకు పిల్లలు హుషారుగా హాజరయ్యారు. పాఠశాలల వద్ద ముగ్గులు వేసి తోరణాలు కట్టి మరీ విద్యార్థులకు స్వాగతం పలికారు. జిల్లాలో 1551 సర్కారు బడులు ఉండగా సుమారు 40 శాతం మంది పిల్లలు తొలిరోజు బడులకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. పాఠ్య పుస్తకాలు, డిక్షనరీలు విద్యార్థులకు ఇచ్చేందుకు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఆత్రేయపురం మండలంలో ప్రధాన ఫౌండేషన్ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చింతా శ్యామ్ కుమార్ పాఠశాల ప్రారంభోత్సవం సందర్భంగా “మన బడి – మన పండుగ” కార్యక్రమాన్ని వినూత్న రీతిలో నిర్వహించారు. ఉదయమే చిన్నారుల ఇంటికి వెళ్లిన శ్యామ్ ప్రత్యేకంగా తయారు చేసిన “మన బడి – మన పండుగ” కిరీటాన్ని వారికి ధరింపజేశారు. తర్వాత మంగళవాద్యాల మధ్య విద్యార్థులను పాఠశాలకు తీసుకొచ్చారు.
మంత్రి లోకేష్ శుభాకాంక్షలు
పార్వతీపురం మన్యం జిల్లాలో వేసవి సెలవుల తర్వాత విద్యార్థులు బడిబాట పట్టారు. మామిడి తోరణాలు కట్టి ఉత్సాహకరమైన వాతావరణంలో ఉపాధ్యాయులు పిల్లలను బడిలోకి ఆహ్వానించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను విద్యాశాఖ అధికారి బ్రహ్మాజీ రావు సందర్శించారు. పాఠశాలలో కొత్తగా ప్రవేశం పొందిన విద్యార్థులను అభినందించారు. వారికి చాక్లెట్లు అందించి ఉత్సాహపరిచారు. వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులకు మంత్రి లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు.
సమగ్ర విద్యా వికాస కేంద్రాలైన ప్రభుత్వ విద్యాలయాలు పిల్లలకు సాదర స్వాగతం పలుకుతున్నాయని పేర్కొన్నారు. ఐక్యత – క్రమశిక్షణకు చిహ్నమైన యూనిఫామ్ ధరించిన విద్యార్థుల్లో తానూ ఒకరై అందరికీ ఆదర్శంగా నిలిచిన అనకాపల్లి జిల్లా విద్యాశాఖాధికారి గిడ్డి అప్పారావు నాయుడుకి మంత్రి లోకేష్ అభినందనలు తెలిపారు. వేసవి సెలవుల అనంతరం పునఃప్రారంభమైన చోడవరం మోడల్ ప్రైమరీ స్కూల్, జిల్లా పరిషత్ గర్ల్స్ హైస్కూల్‌లో యూనిఫామ్ ధరించిన డీఈవో విద్యార్థులతో కలిసి పాఠశాల ప్రార్థనలో పాల్గొని ప్రతిజ్ఞ చేయడం స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు.
