పెద్దపల్లికి రానున్న కీలక సౌకర్యం

పెద్దపల్లికి రానున్న కీలక సౌకర్యం
- రవాణా శాఖ మంత్రి పొన్నం
- త్వరలో పెద్దపల్లి ప్రజల చిరకాల వాంఛ
పెద్దపల్లి, ఆంధ్రప్రభ : పెద్దపల్లి ప్రజల చిరకాల వాంఛ అయిన ఆర్టీసీ బస్ డిపో నిర్మాణం త్వరలో సాకారం కానుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
ఆదివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావుతో కలిసి ఆర్టీసీ బస్ డిపో నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు.

దశాబ్దాలుగా పెద్దపల్లిని ప్రాతినిధ్యం వహించిన ప్రజాప్రతినిధులు బస్ డిపో నిర్మాణంపై హామీలు ఇచ్చినా అవి అమలుకు నోచుకోలేదని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఆ హామీ నెరవేరబోతోందని పేర్కొన్నారు.
ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు ప్రత్యేక చొరవతో బస్ డిపోకు ఆమోదం పొందడంతో పాటు రూ.6 కోట్ల నిధులు మంజూరు చేయించారని తెలిపారు. నిర్మాణ పనులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
బస్ డిపో అందుబాటులోకి వస్తే పెద్దపల్లి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు లభిస్తాయని, ప్రయాణికులకు మరింత సౌలభ్యం కలుగుతుందని మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
