అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన సర్పంచ్ స్పందన
కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలంలోని నచ్చన్ ఎల్లాపూర్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని శనివారం గ్రామ సర్పంచ్ బొడ్డు స్పందన గంగన్న సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. చిన్నారుల ఆరోగ్యం, పోషణ, విద్యా కార్యక్రమాల అమలుపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ సందర్భంగా పిల్లలతో స్నేహపూర్వకంగా ముచ్చటిస్తూ వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.
అనంతరం చిన్నారులతో కలిసి భోజనం చేసి, వారికి అందిస్తున్న ఆహారం నాణ్యతను స్వయంగా పరిశీలించారు. పిల్లలకు అందించే భోజనం శుభ్రంగా, పౌష్టికంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం ప్రతిరోజూ సమతుల ఆహారం అందించాలని అంగన్వాడీ సిబ్బందికి తెలిపారు.
సర్పంచ్ మాట్లాడుతూ, చిన్నారుల శారీరక, మానసిక అభివృద్ధికి పౌష్టికాహారం కీలకమని, ఈ విషయంలో అంగన్వాడీ కేంద్రాలు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. పిల్లల హాజరు పెరగడానికి తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. అలాగే కేంద్రంలో పరిశుభ్రత, భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి శాంత, అంగన్వాడీ టీచర్ లక్ష్మి, ఉపసర్పంచ్ లక్ష్మి ఆనంద్, కారోబార్ మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
