బీఎల్‌వోల ద్వారా ఇంటింటికీ ఫారాలు పంపిణీ..
ఇంద్రవెల్లి, ఆంధ్రప్రభ : అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని ముత్తునూరు గ్రామంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌వోలు) ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేస్తున్నారు.
ఫారాలు అందజేసే సమయంలో వాటిని స్కాన్ చేసి నమోదు చేయడంతో పాటు, ఫారాన్ని ఎలా నింపాలి, ఏ వివరాలు నమోదు చేయాలనే విషయాలపై ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ ప్రక్రియను భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం నిర్వహిస్తున్నారు.
అలాగే, ఓటర్లు పూర్తిగా నింపిన ఫారాలను తిరిగి స్వీకరించే సమయంలో కూడా బీఎల్‌వోలు స్కానింగ్ నిర్వహించి, వివరాలను డిజిటల్ రూపంలో నమోదు చేస్తున్నారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ప్రతి ఓటరు సరైన వివరాలతో ఫారాన్ని పూర్తి చేసి నిర్ణీత గడువులోపు సంబంధిత బీఎల్‌వోకు అందజేసి ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమానికి సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారి ఆచే శివరావు, ముత్తునూరు అంగన్‌వాడీ కార్యకర్త మేశ్రం సుమిత్ర, మేశ్రం కేశవ్, బీఎల్‌వోలు, గ్రామస్థులు పాల్గొన్నారు.
