కవిత సమక్షంలో జాగృతిలో చేరిక..!

ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా బోత్ మాజీ శాసనసభ్యుడు రాథోడ్ బాపూరావు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈనెల 25న కొత్త రాజకీయ పార్టీగా ఆవిర్భవించే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమక్షంలో ఈరోజు చేరిన బాపూరావు కొత్త పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. 2014, 2019 ఎన్నికల్లో రెండుసార్లు వరుసగా బోత్ నియోజవర్గం నుండి టిఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన రాథోడ్ బాపురావు ఆ తర్వాత పార్టీ టికెట్ దక్కకపోవడంతో బిజెపిలో కొంతకాలం కొనసాగారు.
ఆ తర్వాత రెండేళ్లుగా కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని రాజకీయాల్లో ఉంటున్న బాపూరావు కాంగ్రెస్ అనుసరిస్తున్న నియంతృత్వ విధానాలు నచ్చకనే పార్టీని వీడుతున్నట్టు స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తమలాంటి గిరిజన నేతలను ఎన్నడూ పట్టించుకోలేదని, పార్టీలో తగినంత గౌరవం కూడా ఇవ్వలేదని ఆయన తెలిపారు.
తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రోద్బలంతోనే తనకు అప్పట్లో టికెట్ వచ్చిందని, జిల్లాలో తెలంగాణ జాగృతిని బలోపేతం చేసినట్టు తెలిపారు. వచ్చే మే నెలలో ఇచ్చోడ కేంద్రంలో కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి కొత్త రాజకీయ పార్టీని గ్రామస్థాయి వరకు తీసుకెళ్తానని ఆయన ఆంధ్రప్రభ కు తెలిపారు. రాథోడ్ బాపూరావుతో సహా పలువురు మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు , కాంగ్రెస్, బిఆర్ఎస్ నేతలు తెలంగాణ జాగృతి కండువా కప్పుకున్నారు.
కవిత బాటలో లోక భూమారెడ్డి..?
కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, రాష్ట్ర మాజీ డైరీ కార్పొరేషన్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీని వీడనున్నట్టు తెలిసింది. కొంతకాలంగా ఆ పార్టీకి దూరంగా ఉంటున్న భూమారెడ్డి కల్వకుంట్ల కవితతో సమాలోచనలు జరపడం చర్చనీయాంశంగా మారింది. మరో నాలుగు ఐదు రోజుల్లో కవిత సమక్షంలోనే కొత్త రాజకీయ పార్టీలో లోక భూమారెడ్డి చేరనున్నట్టు ఆయన వర్గీయులు తెలిపారు.
