అనుమతులు లేకుండానే ఇటుకల బట్టీలు

కాలుష్యానికి కేంద్రాలుగా మారిన బట్టీలు – ఆదాయాన్ని కోల్పోతున్న పంచాయతీలు

మైలవరం, ఆంధ్రప్రభ : మైలవరం మండలంలో ఇటుకల బట్టీలు విచ్చలవిడిగా విస్తరిస్తుండటంపై స్థానిక ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సంబంధిత ప్రభుత్వ శాఖల నుంచి అవసరమైన అనుమతులు లేకుండానే అనేక ప్రాంతాల్లో ఇటుకల తయారీ కేంద్రాలు కొనసాగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండలంలోని మైలవరం, వెల్వడం, కీర్తిరాయునిగూడెం, గణపవరం తదితర గ్రామాల పరిధిలో 20కి పైగా ఇటుకల బట్టీలు నిర్వహణలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటుకల బట్టీల ఏర్పాటుకు పంచాయతీ, కాలుష్య నియంత్రణ మండలి, గనుల శాఖ, రెవెన్యూ శాఖల అనుమతులు తప్పనిసరి అయినప్పటికీ, చాలా బట్టీలు నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

అధికారులు తనిఖీలు నిర్వహించకపోవడంతో యజమానులు నిర్భయంగా కార్యకలాపాలు సాగిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా రహదారుల పక్కనే బట్టీలు ఏర్పాటు చేయడంతో వాటి నుంచి వెలువడుతున్న పొగ, దుమ్ము కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొగమంచు మాదిరిగా వ్యాపిస్తున్న కాలుష్యం వల్ల రోడ్లపై దారి కనబడక ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు చెబుతున్నారు. అంతేకాకుండా బట్టీల నుంచి వెలువడే పొగ కారణంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, కంటి మంటలు, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇటుకల బట్టీల నిర్వహణ ద్వారా గ్రామ పంచాయతీలకు పన్నులు, ఫీజుల రూపంలో ఆదాయం సమకూరే అవకాశం ఉన్నప్పటికీ, సరైన నమోదు లేకపోవడం వల్ల ఆ ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరడం లేదనే విమర్శలు ఉన్నాయి. దీంతో పంచాయతీలు గణనీయమైన ఆదాయాన్ని కోల్పోతున్నట్లు తెలుస్తోంది. ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా మండలంలోని ఇటుకల బట్టీలపై సమగ్ర విచారణ చేపట్టి, అనుమతులు లేని బట్టీలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. సంబంధిత శాఖల అధికారులు వెంటనే స్పందించి నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బట్టీలపై తనిఖీలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. అనుమతులు లేని ఇటుకల బట్టీలపై అధికారులు దృష్టి సారిస్తారా..? లేక యథావిధిగా కొనసాగనిస్తారా..? అనే ప్రశ్న ప్రస్తుతం మండల ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.