బక్రీద్ వేడుకలకు పకడ్బందీ భద్రత
బక్రీద్ వేడుకలకు పకడ్బందీ భద్రత
- మసీదులు, ఈద్గాలను తనిఖీ చేసిన ఎస్సై జాడి శ్రీధర్
క్యాతన్‌పల్లి, ఆంధ్రప్రభ: రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్, మందమర్రి సీఐ పరస రమేష్ ఆదేశాల మేరకు రామకృష్ణాపూర్ పట్టణ ఎస్సై జాడి శ్రీధర్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా మసీదులు, ఈద్గాలు మరియు చెక్‌పోస్టుల వద్ద భద్రతా ఏర్పాట్లను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.
బక్రీద్ (ఈద్-ఉల్-అధా) పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని మసీదులు, ఈద్గాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నామని ఎస్సై తెలిపారు. పండుగ విధుల్లో పాల్గొనే పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ఏదైనా చిన్న ఘటన జరిగినా వెంటనే స్పందించి, పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని సిబ్బందిని ఆదేశించారు.
మతసామరస్యానికి భంగం కలిగించేలా సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు చేయడం, అసత్య ప్రచారాలు లేదా వదంతులు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు. పౌరులు అత్యవసర సహాయం లేదా సమాచారం కోసం స్థానిక పోలీసులను సంప్రదించాలని, లేని పక్షంలో డయల్-100కు ఫోన్ చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ రజిత, హెడ్ కానిస్టేబుల్ జంగు కంక, మహిళా కానిస్టేబుల్ రమ్యతో పాటు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
