ఆంధ్రప్రభ బ్యూరో ఉమ్మడి ఆదిలాబాద్ : తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దుల్లోని చంద్రాపూర్ జిల్లాలో ఇటీవల ఇద్దరిని హతమార్చిన పెద్దపులిని ఎట్టకేలకు వేటాడి బంధించారు. తార – 224 అనే పేరున్న ఆడ పులి తడోబా అటవీ ప్రాంతంలో హడలెత్తిస్తూ తునికాకు కూలీలను, గిరిజన గ్రామాల ప్రజల్లో వణుకు పుట్టిస్తోంది. ఈ పెద్ద పులి వారం రోజుల్లో ఇద్దరిని పొట్టన పెట్టుకోగా అడవుల్లో అమర్చిన సీసీ కెమెరాలు, ట్రాప్ సిబ్బంది సహకారంతో ఈ ఆడపులిని శుక్రవారం సాయంత్రం అటవీశాఖ అధికారులు అన్వేషించి కదలికలను గుర్తించారు. ఆ తర్వాత ఈరోజు ఉదయం మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో పెద్దపులి ని ఫారెస్ట్ అధికారులు బందించారు.
మత్తుమందు ఇచ్చి.. పులిని బంధించి..

మ్యాన్ ఈటర్ గా హడలెత్తిస్తున్న ఈ పెద్ద పులి కోసం వారం రోజులుగా అన్వేషిస్తున్న సిబ్బంది చివరకు మత్తుమందు ప్రయోగంతో స్పృహ లేకుండా చేశారు. ఆ తర్వాత బంధించి చంద్రాపూర్ పులుల సంరక్షణ కేంద్రానికి తరలించారు . ఆటవీశాఖ అధికారి రాకేష్ హేపట్ తెలిపిన వివరాల ప్రకారం నాగభీడ్ తాలూకాలో తునికాకు సేకరణకు వెళ్లిన వారిలో ఒకరితోపాటు పశువుల కాపరిపై దాడి చేసి హతమార్చింది. తారా 224 అనే పులిగా గుర్తించామని తెలిపారు. ఈ నేపథ్యంలో సీసీ కెమెరాలు, ప్రత్యేక సిబ్బందితో ఆటవీశాఖ అధికారులు ఈ పులి కదలికలపై ఆరా తీసినట్టు తెలిపారు. తడోబా -బాలాపూర్ అటవీ ప్రాంతంలో దీని కదలికలను సీసీపుటేజీల ద్వారా గమనించిన అధికారులు షూటర్ అజయ్ మరారే సాయంతో మత్తు ఇంజక్షన్ ను ప్రయోగించారు. స్పృహ కోల్పో యిందని పశు వైద్యాధికారి రవికాంత్ కోబ్రాగడే ద్వారా నిర్ధారించిన అనంతరం పెద్దపులిని చంద్రాపూర్ ప్రత్యేక కేంద్రానికి తరలించారు. ఇది ఎనిమిది సంవత్సరాల ఆడ పులి అని అధికారులు వివరించారు. సామాన్యులను బలిగొన్న పెద్దపులిని నిర్బంధించడంతో చంద్రపూర్ అటవీ ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.