తొలి ఏడాది ఎంతో సంతృప్తికరం

తొలి ఏడాది ఎంతో సంతృప్తికరం
- రైతు భరోసా కేంద్రాలను రొయ్య భరోసా కేంద్రాలుగా మార్చాలి..
- రాజ్యసభ సభ్యుడు పాక వెంకట సత్యనారాయణ
భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ : రాజ్యసభ సభ్యుడిగా పదవి బాధ్యతలు చేపట్టి తొలి ఏడాది పూర్తి చేసుకోవడం ఎంతో సంతృప్తికరంగా ఉందని పాక వెంకట సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా భీమవరంలోని ఆయన కార్యాలయంలో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో కిలో మటన్ రూ.1,000 ధర పలుకుతోందని పేర్కొన్నారు. 60 కౌంట్ రొయ్యలకు రూ.300 ధర లభిస్తే ప్రభుత్వ సబ్సిడీల అవసరం ఉండదని అన్నారు. రైతు భరోసా కేంద్రాలను రొయ్య భరోసా కేంద్రాలుగా మార్చాలని సూచించారు.
ఒక్క ఎకరం రొయ్యల చెరువు సాగుతో మంచి ఆదాయం పొందవచ్చని పేర్కొన్నారు. రాష్ట్రంలో ధాన్యం ఎగుమతుల కంటే రొయ్యల ఎగుమతులపై దృష్టి పెట్టాలని అభిప్రాయపడ్డారు. ఆక్వా రంగం రాష్ట్రానికి ప్రధాన బలమని తెలిపారు.
కోళ్లు త్వరితగతిన పెరిగేందుకు ఇంజక్షన్లు ఉపయోగిస్తున్నారని, దీని వల్ల లివర్, కిడ్నీ సమస్యలతో పాటు క్యాన్సర్ ప్రమాదం కూడా ఉంటుందని అన్నారు. రొయ్యల్లో అధిక ప్రోటీన్ ఉంటుందని, ఈశాన్య రాష్ట్రాల్లో వాటి వినియోగం ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు.
దేశంలో 78 శాతం ఉత్పత్తి వాటా కలిగిన ఆక్వా రంగ సమస్యలపై పార్లమెంటులో చర్చించినట్లు తెలిపారు. బీసీ సంక్షేమం, నైపుణ్యాభివృద్ధి, సంప్రదాయ వృత్తుల పరిరక్షణ అంశాలను ప్రస్తావించినట్లు చెప్పారు.
పరిశ్రమల కాలుష్య నియంత్రణకు సిఎస్‌ఆర్ నిధులను సమర్థంగా వినియోగించాలనే సూచనలు చేశానని అన్నారు. వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికత అవసరమని, నదీ జలాల సమర్థ వినియోగంపై కూడా మాట్లాడినట్లు తెలిపారు.
కొల్లేరు రైతుల సమస్యలపై మాన్యువల్ సర్వే విధానం ద్వారా పరిష్కారం అవసరమని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ అధికార ప్రతినిధి ముళ్ళపూడి రేణుక, జిల్లా అధ్యక్షురాలు ఐనంపూడి శ్రీదేవి, జిల్లా ప్రధాన కార్యదర్శి కలిదిండి వినోద్ వర్మ, రావూరి సుధ, మీడియా కోఆర్డినేటర్ కపర్థి, కోమటి రవికుమార్, సుబ్రహ్మణ్యం, గాదిరాజు వెంకటేశ్వరరాజు, కోరాడ రామ్మూర్తి, వదిలిశెట్టి ప్రసాద్, అడబాల శివ తదితర నాయకులు పాల్గొని ఆయనను గజమాలలతో సత్కరించారు.
