ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం
- గద్దె క్రాంతి కుమార్
- వైద్య ఖర్చుల కోసం ఇద్దరికి రూ.15 వేల ఆర్థిక సాయం..
పటమట, ఆంధ్రప్రభ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని రెట్టింపు స్థాయిలో అందిస్తూ అభివృద్ధి, సంక్షేమాన్ని సమన్వయంతో ముందుకు తీసుకెళ్తోందని టీడీపీ యువనేత గద్దె క్రాంతి కుమార్ పేర్కొన్నారు.
సోమవారం అశోక్‌నగర్‌లోని తూర్పు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఇద్దరికి వైద్య ఖర్చుల నిమిత్తం గద్దె క్రాంతి కుమార్ తన సొంత నిధుల నుంచి రూ.15 వేల ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ సందర్భంగా 7వ డివిజన్‌కు చెందిన మేకల మధుకు రూ.10 వేలు, 16వ డివిజన్‌కు చెందిన వేముల రవికి రూ.5 వేలు చొప్పున ఆర్థిక సహాయం అందించారు.
అనంతరం గద్దె క్రాంతి కుమార్ మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన అనేక సంక్షేమ కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం పునరుద్ధరించడమే కాకుండా, కొత్త పథకాల ద్వారా మహిళలు, యువత, రైతులు, వృద్ధులు, పేద కుటుంబాలకు నేరుగా లబ్ధి చేకూరేలా చర్యలు చేపట్టిందన్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టుకుంటూనే సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తోందని తెలిపారు. ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఫలాలు చేరేలా పారదర్శక పాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వం, అభివృద్ధి పనులతో పాటు సామాజిక భద్రతను కూడా బలోపేతం చేస్తోందని పేర్కొన్నారు.
రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన అన్నారు. ప్రజలు వాస్తవాలను గుర్తించి అభివృద్ధి, సంక్షేమాన్ని మరింత బలోపేతం చేసే కూటమి ప్రభుత్వానికి అండగా నిలవాలని గద్దె క్రాంతి కుమార్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కాపు కార్పొరేషన్ డైరెక్టర్ రత్నం రమేష్, పటమట సతీష్ చంద్ర, దూదేకుల కార్పొరేషన్ డైరెక్టర్ మైలమూరి పీరుబాబు, పెనుగొండ శ్రీనివాస్, రాజనాల పవన్ తదితరులు పాల్గొన్నారు.
