గీత కార్మికుల హామీల అమలుకు ప్రభుత్వాన్ని కోరిన కేజీకేఎస్
కేసముద్రంలో జనసంద్రంగా గీతన్నల చైతన్య యాత్ర
కేసముద్రం, ఆంధ్రప్రభ : గీత కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి, వారి సమస్యలను ప్రాధాన్యంగా పరిష్కరించాలని కేజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి. రమణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు కోరారు.
గీత కార్మికుల హక్కులు, సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన “అమరుల యాదిలో.. గీతన్నల చైతన్య యాత్ర” సోమవారం మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో భారీగా కొనసాగింది. కేజీకేఎస్ మండల అధ్యక్షుడు బబ్బూరి ఉప్పలయ్య, కార్యదర్శి మేడం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో, గోపా డివిజన్ అధ్యక్షుడు చిలువేరు సమ్మయ్య గౌడ్ అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు.
మహబూబాబాద్ జిల్లాలో ప్రారంభమైన ఈ యాత్రలో భాగంగా కేసముద్రంలో సుమారు వెయ్యి ద్విచక్ర వాహనాలతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి రెండు వేల మందికి పైగా గీత కార్మికులు, గౌడ సంఘాల ప్రతినిధులు, యువకులు పాల్గొన్నారు.
పొట్టి శ్రీరాములు సెంటర్‌లో గోపా డివిజన్ అధ్యక్షుడు సమ్మయ్య గౌడ్ కేజీకేఎస్ రాష్ట్ర నాయకత్వానికి గజమాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు రమణ, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గీత కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఆలస్యం చేయకుండా అమలు చేయాలని కోరారు. గ్రామస్థాయిలో గీత కార్మికుల సమస్యలను తెలుసుకుని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకే ఈ చైతన్య యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ప్రధాన డిమాండ్లు
గీత కార్మికుల ఎక్స్‌గ్రేషియాను రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రమాదాల్లో మరణించిన గీత కార్మికుల కుటుంబాలకు పెండింగ్‌లో ఉన్న ఎక్స్‌గ్రేషియా బకాయిలను విడుదల చేయాలని కోరారు.
తాటి, ఈత చెట్లు ఎక్కడానికి అవసరమైన భద్రతా కిట్లు పూర్తిస్థాయిలో అందించాలని, జనగామ జిల్లాకు సర్దార్ పాపన్న పేరు పెట్టాలని, హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై శ్రీ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా: సమ్మయ్య గౌడ్
గోపా డివిజన్ అధ్యక్షుడు చిలువేరు సమ్మయ్య గౌడ్ మాట్లాడుతూ, గీత కార్మికుల హక్కుల సాధన కోసం చేపట్టిన చైతన్య యాత్రకు తన పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. రాష్ట్ర నాయకత్వం ప్రతిపాదించిన న్యాయమైన డిమాండ్లను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, డీసీసీ అధ్యక్షురాలు ఉమా మురళి నాయక్ సహకారంతో రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, ముఖ్యమంత్రి దృష్టికి చేరేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గౌని వెంకన్న, రాష్ట్ర ఉపాధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు బన్నీ వెంకట మల్లయ్య, వి. వెంకట నరసయ్య, గౌని సాంబయ్య, చౌగాని సీతారాములు, ఎస్. రమేష్ గౌడ్, ఎస్. వెంకట్ గౌడ్, యమగాని వెంకన్న, గోడం వెంకటేశ్వర్లు, పానుగంటి వీరస్వామి, బుర్ర సుధాకర్, తాళ్లపల్లి నర్సయ్య, బాలబోయిన రాంబాబు, రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ రాజేష్‌తో పాటు వివిధ గ్రామాల గీత కార్మికులు, గౌడ సంఘాల ప్రతినిధులు, బహుజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.
