దేవస్థానం ఎన్నికల ప్రక్రియలో గందరగోళం..
చిట్టినగర్, ఆంధ్రప్రభ : విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని చిట్టినగర్ సెంటర్లో ఉన్న శ్రీ నగరాల సీతారామస్వామి–శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం కార్యాలయానికి తాళం వేసి ఉండడంతో పాటు నామినేషన్ పత్రాలు అందజేసేందుకు అధికారులు లేకపోవడంతో, సోమవారం ఎన్నికల్లో పోటీ చేయనున్న పలువురు అభ్యర్థులు నిరసన వ్యక్తం చేశారు.
దేవస్థానం పాలకమండలి సభ్యుల ఎన్నికలను సజావుగా నిర్వహించాలని కోరుతూ అభ్యర్థులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నగరాల యువజన సంఘం సభ్యుడు బి. బెనర్జీ మాట్లాడుతూ, ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ, షెడ్యూల్ ప్రకారం నామినేషన్ పత్రాల స్వీకరణ ప్రారంభం కావాల్సి ఉన్నా, పోటీ చేసే అభ్యర్థులకు నామినేషన్ పత్రాలు అందించడం లేదని ఆరోపించారు.
సమాచారం అందుకున్న దేవస్థానం పాలకమండలి మాజీ సభ్యుడు బేసు కంఠేశ్వరరావు అక్కడికి చేరుకుని ఎన్నికల అధికారులతో మాట్లాడారు. అధికారులు మంగళవారం ఉదయం కార్యాలయానికి వచ్చి నామినేషన్ ప్రక్రియ చేపడతామని హామీ ఇవ్వడంతో అభ్యర్థులు తమ నిరసనను విరమించారు. ఈ కార్యక్రమంలో ఈ. బాబురావు, బి. సాయి సుధాకర్, బి. బెనర్జీ, ఈ. పవన్ కుమార్, బి. పాపారావు, టి. భరత్ తదితరులు పాల్గొన్నారు.
