Rs-25k-Nss : నేత‌న్న సేవ‌కు సిద్ధం Andhra Prabha Top News

Rs-25k-Nss : నేత‌న్న సేవ‌కు సిద్ధం Andhra Prabha Top News

  • ఈ నెల 7 నుంచి అమ‌లు
  • ఏటా చేనేతలకు రూ.25 వేల ఆర్థిక సాయం
  • 5 తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులకు తుది గడువు
  • గడువులోగా దరఖాస్తులు చేసుకోవాలి
  • ఎన్నికల్లో హామీ ఇవ్వకున్నా అమలు చేస్తున్నాం
  • పథకం అమలులో ఆరోపణలకు, విమర్శలకు తావివ్వొద్దు
  • 7న చీరాలలో జాతీయ చేనేత దినోత్సవం వేడుకలు
  • చేనేత, జౌళి శాఖాధికారుల సమీక్షా సమావేశంలో మంత్రి సవిత

(అమరావతి, ఆంధ్ర‌ప్ర‌భ‌)

అర్హులైన వారందరికీ నేతన్న సేవలో పథకం వర్తింపజేస్తామని, చేనేతలకు ఆర్థిక భరోసాతో కూడిన గౌరవప్రదమైన జీవనం అందించడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని ఏపీ చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. నేతన్నలకు ఏటా రూ.25 వేలను ఆర్థిక సాయం అందజేసేలా నేతన్న సేవలో పథకాన్ని రూపొందించారన్నారు. ఈ నెల ఏడో తేదీన జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ పథకాన్ని శ్రీకారం చుడుతున్నామని, అయిదో తేదీలోగా అర్హులైన చేనేతలు దరఖాస్తులు చేసుకోవాలని మంత్రి సవిత కోరారు. రాష్ట్ర సచివాలయంలో అన్ని జిల్లాలకు చెందిన చేనేత, జౌళి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి సవిత పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ, చేనేతలకు గౌరవ ప్రదమైన జీవనం అందించడమే సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో చేనేత రంగ అభివృద్ధికి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. అదే సమయంలో చేనేతలకు వ్యక్తిగతంగా ఆర్థిక వృద్ధి కలిగేలా పలు సంక్షేమ పథకాలను శ్రీకారం చుట్టామన్నారు. 50 ఏళ్లు నిండిన నేతలన్నకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందజేస్తున్నామన్నారు. ప్రతి చేనేత కుటుంబానికి లబ్ధి కలిగేలా ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. మగ్గం మీద నేసే నేతన్నలకు 200 యూనిట్లు, మర మగ్గం నేతన్నలకు 500 యూనిట్ల వరకూ విద్యుత్ ను ఉచితంగా అందజేస్తున్నామన్నారు. ఇవే కాకుండా త్రిఫ్ట్ ఫండ్ నిధులు, ముద్రా రుణాలను కూడా అందజేస్తున్నామని మంత్రి సవిత తెలిపారు.

Rs-25k-Nss హామీ ఇవ్వకున్నా

ఎన్నికల్లో హామీ ఇచ్చిన పథకాలతో పాటు హామీ ఇవ్వని పథకాలను సీఎం చంద్రబాబునాయుడు అమలు చేస్తున్నారని మంత్రి సవిత తెలిపారు. చేనేతలకు ఏటా రూ.25 వేల ఆర్థిక సాయం అందజేసేలా నేతన్న సేవలో పథకానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుడుతున్నారు. ఈ నెల ఏడో తేదీన జాతీయ దినోత్సవం సందర్భంగా ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి చేనేతకూ ఏడాదికి రూ.25 వేలు అందించనున్నామన్నారు. చేనేత వృత్తిదారులకు ప్రభుత్వ పరంగా అండాలనే ఉద్దేశంతో నూతన పథకానికి శ్రీకారం చుడుతున్నారన్నారు. చేనేత కుటుంబాలు గౌరవప్రదమైన జీవనం సాగించడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని మంత్రి సవిత తెలిపారు.

Rs-25k-Nss 5 వరకూ దరఖాస్తులకు గడవు

రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన ప్రతి నేతన్నకూ నేతన్న సేవలో పథకం ద్వారా ఆర్థిక సాయం అందించాలనేది సీఎం చంద్రబాబు ప్రధాన ఉద్దేశమని మంత్రి సవిత వెల్లడించారు. ఈ నెల అయిదో తేదీ సాయంత్ర అయిదు గంటల్లోకా అర్హులైన నేతన్నలు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. ఈ నెల ఏడో తేదీ నుంచి ఆర్థిక సాయం పథకాన్ని అమలు చేయనున్నామన్నారు. అన్ని జిల్లాలకు చెందిన చేనేత, జౌళి శాఖ ఏడీలు నేతన్న సేవలో పథకంపై విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. మీడియాలోనూ సమాచారమివ్వాలని, వీలైనంత ఎక్కువ మంది నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ఆదేశించారు. అర్హత కలిగిన ప్రతి నేతన్నకూ నేతన్న సేవలో పథకం లబ్ధి కలిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. సీఎం చంద్రబాబునాయుడు లక్ష్య సాధనలో భాగంగా, విమర్శలకు, ఆరోపణలకు తావులేకుండా నేతన్న సేవలో సథకం అమలయ్యేలా అధికారులు పనిచేయాలని మంత్రి సవిత దిశా నిర్దేశం చేశారు. రాష్ట్ర చేనేత, జౌళి శాఖ ముఖ్య ప్రధాన కార్యదర్శి ఆర్పీ సోసిడియా మాట్లాడుతూ, ఈ నెల ఆరో తేదీ ఉదయానికి అన్ని జిల్లాల నుంచి లబ్ధిదారుల వివరాలు అందజేయాలన్నారు.

Rs-25k-Nss 7న చీరాలలో..

ఈ నెల ఏడో తేదీన చీరాలలో జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. ఆనాటి వేడుకలకు సీఎం చంద్రబాబునాయుడు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారన్నారు. అదే రోజు నేతన్న సేవలో పథకానికి ఆయన శ్రీకారం చుడతారన్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు. ర్యాలీలు, చేనేత వస్త్రాల వినియోగంపై ప్ల కార్డులు కూడా ప్రదర్శించాలని మంత్రి సవిత స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో చేనేత, జౌళి శాఖ కమిషనర్ రేఖారాణి, అన్ని జిల్లాల ఏడీలు , ఆప్కో అధికారులు పాల్గొన్నారు.