ఇండియా స్కిల్స్ పోటీలకు సిద్ధం కండి..!
- ఇండియా స్కిల్స్ పోటీల్లో యువత అధిక సంఖ్యలో పాల్గొనాలి
- 63 నైపుణ్యాల విభాగాల్లో ప్రతిభ చాటుకునే సువర్ణావకాశం
- జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
( విజయవాడ, ఆంధ్రప్రభ) : దేశవ్యాప్తంగా యువతలో నైపుణ్యాలను వెలికితీసి, అంతర్జాతీయ స్థాయిలో వారి ప్రతిభను చాటుకునేందుకు ఇండియా స్కిల్స్ కాంపిటీషన్–2026–27 గొప్ప వేదికగా నిలుస్తోందని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ పేర్కొన్నారు. ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
సోమవారం శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ, ఇతర అధికారులతో కలిసి ఇండియా స్కిల్స్ కాంపిటీషన్–2026–27 పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని ఐటీఐలు, పాలిటెక్నిక్‌లు, డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఈ పోటీల్లో తప్పనిసరిగా పాల్గొని తమ ప్రతిభను జాతీయ స్థాయిలో నిరూపించుకోవాలని సూచించారు. ఈ పోటీల్లో మొత్తం 63 నైపుణ్య విభాగాల్లో పాల్గొనే అవకాశం ఉందని తెలిపారు.
విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించిన ఆయన, నైపుణ్యాలే ఉపాధి, స్వయం ఉపాధి, ప్రపంచ స్థాయి అవకాశాలకు పునాదిగా నిలుస్తాయని అన్నారు. తమ ప్రతిభను నిరూపించుకోవడానికి ఈ పోటీలు ఉత్తమ అవకాశమని పేర్కొన్నారు.
జిల్లాలోని అన్ని విద్యాసంస్థల యాజమాన్యాలు ఈ సమాచారాన్ని విద్యార్థులకు విస్తృతంగా చేరవేసి, ఎక్కువ మంది నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌వో ఎం. లక్ష్మీనరసింహం, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్. శ్రీనివాసరావు, డా. జె. సుమన్ తదితరులు పాల్గొన్నారు.
