రైతు సమస్యలపై రాజకీయం వద్దు

ఎంపీ పుట్టా మహేష్ కుమార్

ఏలూరు, ఆంధ్రప్రభ: అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల ప్రభావంతో ఈ ఏడాది పొగాకు ధరలు తగ్గి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వారికి గిట్టుబాటు ధర కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చర్యలు తీసుకుంటున్నాయని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. రైతుల సమస్యలను కూడా కొందరు రాజకీయాలకు వాడుకోవడం బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు.

పొగాకు రైతులకు అండగా చర్యలు

ఏలూరులోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా దర్బార్‌, మీడియా సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ.. పొగాకు రైతుల సమస్యలపై తాను, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు పలుమార్లు కేంద్ర వాణిజ్య మంత్రి, పొగాకు బోర్డు ఛైర్మన్‌, సభ్యులతో చర్చించినట్లు తెలిపారు. బ్రైట్ రకం పొగాకుకు కిలో రూ.240, మీడియం రకం రూ.190, లో గ్రేడ్ పొగాకుకు రూ.110 కంటే తక్కువకు కొనుగోలు చేయకుండా చర్యలు తీసుకున్నామని, దీనివల్ల ధరలు క్రమంగా మెరుగుపడుతున్నాయని చెప్పారు.

వడ్డీ లేని రూ.50 వేల రుణం

ఇటీవల జరిగిన పొగాకు బోర్డు సమావేశంలో రైతుల రుణ సమస్యలను ప్రస్తావించగా, ఒక్కో బ్యారల్‌కు రూ.50 వేల వరకు వడ్డీ లేని రుణం ఇవ్వడానికి బోర్డు అంగీకరించిందని తెలిపారు. దీంతో ముఖ్యంగా లో గ్రేడ్ పొగాకు రైతులకు కొంత ఉపశమనం లభిస్తుందని చెప్పారు.

లో గ్రేడ్‌, ఆఫ్‌ స్టైల్‌ పొగాకు రైతులకు కిలోకు రూ.20 అదనపు మద్దతు ధర ఇవ్వాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముందుగా కిలోకు రూ.10 చెల్లించాలని నిర్ణయించామని చెప్పారు. ఇందుకోసం రూ.100 కోట్లకు పైగా భారం పడుతున్నప్పటికీ రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు.

రైతు సమస్యలపై రాజకీయాలు తగవు..

గతేడాది కొనుగోలు చేసిన పొగాకు నిల్వలు ఇంకా గోదాముల్లో ఉన్నప్పటికీ ఈ ఏడాది కూడా ప్రభుత్వం కొనుగోళ్లు కొనసాగిస్తోందన్నారు. రైతులను ఆదుకునేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్న సమయంలో ప్రతిపక్షాలు దీనిని రాజకీయ అంశంగా మార్చేందుకు ప్రయత్నించడం సరికాదని విమర్శించారు. గత రెండేళ్లలో కిలో పొగాకుకు గరిష్టంగా రూ.470 వరకు ధర వచ్చేలా కృషి చేశామని గుర్తుచేశారు.

అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం..

యుద్ధ పరిస్థితులు, అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ తగ్గడం, కొనుగోలుదారులు ముందుకు రాకపోవడం వల్లే ఈ ఏడాది ధరలు పడిపోయాయని ఎంపీ వివరించారు. పొగాకు బోర్డు అనుమతించిన విస్తీర్ణానికంటే ఎక్కువ సాగు చేయడం కూడా సమస్యలకు కారణమవుతోందని పేర్కొన్నారు. రైతులు బోర్డు అనుమతి మేరకే నారుమడులు వేసి సాగు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఆయిల్‌పామ్ వైపు దృష్టి పెట్టాలి

పొగాకుకు ప్రత్యామ్నాయంగా ఆయిల్‌పామ్ సాగుపై రైతులు దృష్టి సారించాలని ఎంపీ సూచించారు. ప్రస్తుతం ఆయిల్‌పామ్ గెలలకు టన్నుకు రూ.24 వేల వరకు ధర లభిస్తోందని, గత ప్రభుత్వ హయాంలో రూ.12–13 వేలే ఉన్న ధర కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రమంగా పెరిగిందన్నారు. విమాన ఇంధనంలో పామాయిల్ వినియోగంపై జరుగుతున్న పరిశోధనలు విజయవంతమైతే భవిష్యత్తులో ధరలు మరింత పెరిగే అవకాశముందని, పొగాకు, మామిడి రైతులు ఆయిల్‌పామ్ సాగును పరిశీలించాలని సూచించారు.

ఏలూరు పార్లమెంట్ పరిధిలో పారిశ్రామికాభివృద్ధికి కూడా చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే మూడు పరిశ్రమలకు శంకుస్థాపన జరిగిందని, త్వరలో మరిన్ని పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందని ఎంపీ తెలిపారు.

ప్రజా దర్బార్‌కు విశేష స్పందన..

ప్రజా దర్బార్‌లో వినతిపత్రాలతో ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామానికి చెందిన నంబూరు రామయ్యకు వైద్య చికిత్స కోసం రూ.8 లక్షల విలువైన ఎల్‌ఓసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్)ను ఎంపీ అందజేసి, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.