బోనాల వేడుకలకు ముందుగా గోల్కొండ ముత్యాలమ్మకు జలాభిషేకం
భక్తిశ్రద్ధలతో విగ్రహాన్ని ఆలయానికి ఊరేగింపుగా తరలింపు
తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ : తొర్రూరు మున్సిపాలిటీ కేంద్రంలో బుధవారం జరగనున్న బోనాల పండుగ సందర్భంగా అమ్మాపురం రోడ్డుకు సమీపంలోని ముత్యాలమ్మ ఆలయంలో ప్రతిష్ఠించనున్న నూతన గోల్కొండ ముత్యాలమ్మ తల్లి విగ్రహానికి సోమవారం జలాభిషేకం నిర్వహించారు.
మున్సిపల్ కార్యాలయం సమీపంలోని బొడ్రాయి వద్ద పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మున్సిపల్ చైర్‌పర్సన్ పూనం శ్రవణ్ కుమార్, వైస్ చైర్‌పర్సన్ సోమ రజని రాజశేఖర్, కౌన్సిలర్లు కొబ్బరికాయలు కొట్టి జలాభిషేక కార్యక్రమాన్ని ప్రారంభించారు.
పట్టణానికి చెందిన వందలాది మంది మహిళలు పాల్గొని ముత్యాలమ్మ తల్లి విగ్రహానికి జలాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు.
అనంతరం ముత్యాలమ్మ తల్లి విగ్రహాన్ని భక్తిశ్రద్ధలతో ఊరేగింపుగా ఆలయానికి తరలించారు. బుధవారం నిర్వహించే బోనాల పండుగలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని, అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావాలని నిర్వాహకులు కోరారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్థులు, భక్తులు పాల్గొన్నారు.
