ప్రజారోగ్యమే ప్రథమ ప్రాధాన్యం..

ప్రజారోగ్యమే ప్రథమ ప్రాధాన్యం..

  • జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పనితీరుపై కలెక్టర్ సమీక్ష
  • వైద్య సేవల అమలుపై ప్రతిరోజూ సమీక్షలు
  • ఆరోగ్య సూచికల మెరుగుదలే లక్ష్యం
  • జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్

నాగర్ కర్నూల్, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ సూచించారు.

శుక్రవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పనితీరుపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో వైద్య సేవల అమలుపై అంశాల వారీగా ప్రతిరోజూ సమీక్షలు నిర్వహిస్తానని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉపకేంద్రాల్లో అందిస్తున్న సేవలపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు.

ప్రజలకు సకాలంలో నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు, ఆసుపత్రుల్లో అవసరమైన మందులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు.

తల్లి-శిశు ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. గర్భిణీల నమోదు, క్రమం తప్పని ఆరోగ్య పరీక్షలు, ప్రసవానికి ముందు, అనంతరం అవసరమైన వైద్య సేవల కల్పనలో నిర్లక్ష్యం ఉండరాదన్నారు. జిల్లాలో తల్లి మరణాలు, శిశు మరణాలు సంభవించకుండా ముందస్తు చర్యలు చేపట్టి, ప్రతి కేసును ప్రాధాన్యంతో పర్యవేక్షించాలని సూచించారు.

హైరిస్క్ గర్భిణీలను గుర్తించి వారికి ప్రత్యేక వైద్య సేవలు అందించాలని తెలిపారు. ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, వైద్యాధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను బలోపేతం చేయడంతో పాటు, ప్రజల్లో ఆరోగ్య అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని చెప్పారు.

సీజనల్ వ్యాధులు, అంటువ్యాధుల నియంత్రణపై ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. వ్యాధుల నివారణకు అవసరమైన చర్యలను ముందుగానే అమలు చేయాలని సూచించారు. ఆరోగ్య సూచికలను మెరుగుపరిచే దిశగా ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పనిచేసి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని పేర్కొన్నారు.

జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ పనితీరును మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల సాధనలో నిర్లక్ష్యం వహించిన అధికారులు, సిబ్బందిపై అవసరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా కృషి చేయాలని స్పష్టం చేశారు.

సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కృష్ణ, ఇమ్యునైజేషన్ అధికారి రవికుమార్, డిప్యూటీ డీఎంహెచ్‌వోలు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సంబంధిత విభాగాల అధికారులు పాల్గొన్నారు.