సొంత ఖర్చులతో మినరల్ వాటర్ సరఫరా..

వెల్దండ, ఆంధ్రప్రభ : ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడం తన బాధ్యత అని, వారి కోసం ఎంత చేసినా అది తక్కువేనని పలుగు తండా సర్పంచ్ రమేష్ నాయక్ అన్నారు.

మండల పరిధిలోని పలుగు తండాలో గత కొన్ని రోజులుగా మిషన్ భగీరథ తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న సర్పంచ్ రమేష్ నాయక్ స్పందించి, తన సొంత ఖర్చులతో 10 వేల లీటర్ల మినరల్ వాటర్ అందించాలని నిర్ణయించారు.

ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆటోను స్వయంగా నడుపుతూ తండాలోని ప్రతి ఇంటికి మినరల్ వాటర్‌ను చేరవేస్తూ ప్రజలకు అండగా నిలిచారు. ఈ సందర్భంగా తండావాసులు మాట్లాడుతూ, ప్రజల కష్టాలను తమ కష్టాలుగా భావించి వెంటనే స్పందించే నాయకులు చాలా అరుదుగా ఉంటారని అన్నారు. ఇలాంటి సేవాభావం కలిగిన సర్పంచ్‌ను ఎన్నుకోవడం తమకు గర్వకారణమని గ్రామస్తులు కొనియాడారు.