సమస్యలు సగం ముగిసినట్టే!
శరీరం మనది… మనం శరీరం కాదు!
మని జీవితంలో అత్యంత పెద్ద సందేహమేమిటంటే… “నేనెవరు?” వినగానే ఆశ్చర్యంగా అనిపించొచ్చు. కానీ ప్రపంచంలోని దాదాపు అన్ని ఆధ్యాత్మిక ధర్మాలకూ, సంప్రదాయాలకూ ముగింపు ఇక్కడే.
ఉదాహరణకి మనం రోజూ అద్దంలో చూసుకుని మురిసిపోయే శరీరాన్నే “నేను” అనుకుంటాం. మనం చేసే ఉద్యోగమే మన గుర్తింపు అనుకుంటాం. మనం సంపాదించే డబ్బు, ఆస్తులే మన విలువగా పరిగణిస్తాం. మనం పొందిన పదవే మన స్థాయి అనుకుంటాం. వీటన్నిటినీ మన విజయాలుగా ఎవరో పొగిడితే చాలా సంతోషపడతాం. వీటిలో ఎక్కడో మన తప్పులను వెతికి తిడితే కుంగిపోతాం. ఎందుకంటే… ఇవన్నీ “నేను” అనే భావనకు అంటించుకున్న తోకలు.
ఒక్కసారి ఆలోచించండి.
చిన్నప్పుడు మీ ముఖం వేరు. ఇప్పుడు వేరు. పది సంవత్సరాల తర్వాత ఇంకోలా ఉంటుంది. అప్పటికీ, ఇప్పటికీ శరీరం మారిపోయింది. ముడతలు రావచ్చు, లావైపోవచ్చు, బక్కచిక్కిపోవచ్చు…కానీ “నేను” అనే అనుభూతి మాత్రం మారిందా? చిన్నప్పుడు “నేను” అన్నవాడే, ఇప్పుడు కూడా “నేను” అంటున్నాడు. అంటే మారింది శరీరం… మారనిది మనలోనే ఏదో ఉంది. అదే ఆత్మ అని భారతీయ ఋషులు వేల ఏళ్ళనాడే చెప్పారు.
ఈ శరీరం ఒక వస్త్రం మాత్రమే. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన ఒక ఉపమానం చాలా గొప్పది.
మనిషి పాత బట్టలు తీసేసి కొత్త బట్టలు వేసుకున్నట్లే, ఆత్మ పాత శరీరాన్ని విడిచి కొత్త శరీరాన్ని ధరిస్తుందని చెప్పారు.
ఈ ఉపమానాన్ని కేవలం జన్మ-పునర్జన్మల కోణంలో మాత్రమే చూడాల్సిన అవసరం లేదు. ప్రతిరోజూ మన జీవితంలో కూడా ఇదే జరుగుతోంది. చిన్న చిన్న సంఘటనలతో మన పాత్రలు మారుతుంటాయి. ఇంట్లో తండ్రి… ఆఫీసులో ఉద్యోగి… స్నేహితుల దగ్గర ఇంకో వ్యక్తి. పాత్రలు మారుతున్నాయి. కానీ నటించేది మాత్రం మనమే.
ఇక్కడ సమస్య ఏమిటంటే… మనం పాత్రనే మన అసలు స్వరూపమని నమ్మేస్తున్నాం.
అవునా? మరి మన అసలు స్వరూపమేమిటి?
అహంకారం అంటే ఏమిటి?
చాలామందికి అహంకారం అంటే గర్వం అనే అనిపిస్తుంది. కానీ ఆధ్యాత్మిక దృష్టిలో అహంకారం అంటే గర్వం కాదు. “నేను ఈ శరీరమే” అనే భావన. అదే అహంకారం.
ఇదిగో…ఈ అహంకారం వల్లే పోలికలు మొదలవుతాయి.
అతనికంటే నేను తక్కువ…వాళ్లకంటే నేను ఎక్కువ…నాకు గౌరవం ఇవ్వలేదు…నన్ను గుర్తించలేదు…ఈ “నేను” అనే గోడ ఎంత ఎత్తుగా పెరుగుతుందో, అంతగా మనశ్శాంతి తగ్గిపోతుంది.
సమస్యలు బయట కాదు… లోపలే ఉన్నాయి. మనిషి ఎప్పుడూ పరిస్థితులు మారితే తాను సంతోషంగా ఉంటానని అనుకుంటాడు.ఉదాహరణకు..మంచి ఉద్యోగం వస్తే…ఇల్లు కట్టుకుంటే…పిల్లలు స్థిరపడితే…ఇంకొంచెం డబ్బు వస్తే…అలా జీవితమంతా “ఇంకొంచెం” కోసం పరుగే. కానీ ఆశ్చర్యం ఏమిటంటే… మనకు కావాల్సింది వచ్చిన తర్వాత కూడా కొత్త కోరిక పుడుతుంది. అంటే సమస్య వస్తువుల్లో లేదు. మనసులో ఉంది.
మనసు అనేది ఒక మంచి సేవకుడు… కానీ చెడ్డ యజమాని
మనసు మనకు చాలా అవసరం. కానీ అది మనల్ని నడపడం మొదలు పెడితే మాత్రం సమస్యలు మొదలవుతాయి.
ఒక మాట వింటే రోజంతా బాధపడుతుంది.
ఒక ప్రశంస వస్తే ఆకాశంలో విహరిస్తుంది.
ఒక అపజయం వస్తే జీవితం అయిపోయిందనుకుంటుంది.
అందుకే ఋషులు మనసును చంపమని చెప్పలేదు. దాన్ని గమనించమన్నారు. అదుపులో ఉంచుకోమన్నారు.
ఆకాశంలో మేఘాలు వచ్చినట్లు ఆలోచనలు వస్తుంటాయి… పోతుంటాయి. మనం మేఘాలు కాదు. ఆకాశంలా ఉండాలి.
నిశ్శబ్దం చెప్పే సత్యం
రోజుకు పది నిమిషాలు ఫోన్ పక్కన పెట్టండి.
ఎవరితోనూ మాట్లాడకుండా ప్రశాంతంగా కూర్చోండి.
మీ శ్వాసను జాగ్రత్తగా గమనించండి.
మొదట్లో విసుగు వస్తుంది. తర్వాత ఆలోచనలు దూసుకొస్తాయి. ఇంకొంతసేపటికి మనసు నెమ్మదిగా ప్రశాంతమవుతుంది.
అక్కడే అసలు ప్రయాణం మొదలవుతుంది.
దేవుడు ఎక్కడ ఉన్నాడు?
ఈ ప్రశ్నకు ప్రపంచంలో వేల సమాధానాలు ఉన్నాయి.
కానీ భారతీయ ఆధ్యాత్మికత మాత్రం ఒక అద్భుతమైన సమాధానం చెబుతుంది.
“నీలో ఉన్న చైతన్యమే దైవం.”
అందుకే దేవాలయానికి వెళ్లడం కంటే, మనలోని దురహంకారాన్ని తగ్గించడం గొప్ప పూజ.
వంద దీపాలు వెలిగించడం కంటే, ఒక మనిషి జీవితంలో వెలుగు నింపడం గొప్ప ఆరాధన.
వేల శ్లోకాలు చదవడం కంటే, ఒక్క మంచి మాట మాట్లాడటం గొప్ప సాధన.
జీవితం అనేది ఎంత సంపాదించామన్న లెక్క కాదు…
ఎంత కాలం బతికామన్న గణాంకం కాదు…
మనల్ని మనం ఎంత తెలుసుకున్నామన్నదే అసలు జీవితం.
ప్రపంచాన్ని జయించినవాడు గొప్పవాడేమో…
కానీ తన మనసును జయించినవాడే నిజమైన యోగి.
బహుశా అందుకే మన ఋషులు వేల ఏళ్ల క్రితమే ఒక గొప్ప సందేశాన్ని మనకు ఇచ్చారు—
“తనను తాను తెలుసుకున్నవాడికి, ప్రపంచం కొత్తగా కనిపిస్తుంది.”
-నల్లాన్ చక్రవర్తుల మధుసూదనాచార్యులు
