మూడు గంటలు రాస్తారోకో..

ట్రాఫిక్ కు అంతరాయం..

  • జనం నానా పాట్లు..
  • 24 గంటల్లో చర్యలకు ఎఫ్డీపీటీ హామీ..
  • ఆదివాసీ యువకుల విడుదల..
  • రాత్రి 11:30కు విరమణ..
  • అటవీశాఖ ఆఫీస్ పై దాడి..
  • ఫర్నిచర్ ధ్వంసం..

జన్నారం,ఆంధ్రప్రభ: అడవుల్లోకి చేపలు పట్టడానికి వలలతో వెళ్ళామని ఆదివాసీ యువకులు చెబుతుండగా,కాదు అడవి జంతువుల వేట కోసమే ఆ యువకులు వచ్చారంటున్నా అటవీ అధికారులు. రాత్రి 8:30 నుంచి 11:30 గంటల వరకు రాస్తారోకో. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం. జనం ఇక్కట్లు. రేంజర్ పై 24 గంటల గడువులోపు చర్యలు తీసుకుంటామని ఎఫ్డీపీటీ హామితో రాస్తారోకో విరమణ. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం వివరాలిలాఉన్నాయి.

మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని ఇందనపల్లి ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని అడవుల్లోని ఓ వాగు వద్దకు ఇందనపల్లినాయికపుగూడకు చెందిన ఆదివాసీలైన మల్లేష్, అనిల్,విష్ణుతో పాటు 6 యువకులు వలలతో చేపలు పట్టడానికి ఆ ఆదివాసీ యువకులు వెళ్ళగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ లాటితో కొట్టాడని తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తుండగా, కాదు ఆ ఆదివాసీ యువకులు అడవి జంతువుల వేట కోసమే వలలతో అడవుల్లోకి వచ్చారని ఇందనపల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ తెలిపారు. తర్వాత ఆ ఆరుగురు యువకులను అదుపులోకి తీసుకున్నామని, అందులో నుంచి మా కళ్ళుగప్పి ఒకరు పరారైనట్లు ఆయన చెప్పారు.

ఈ విషయం తెలుసుకున్న ఆ ఆదివాసీల తల్లిదండ్రులు, పలువురు బంధుమిత్రులు రాత్రి 8:30 గంటలకు ఇందనపల్లి ఫారెస్ట్ కార్యాలయంలోకి పలువురు చొరబడి ప్లాస్టిక్ కుర్చీలను, బల్లలను ధ్వంసం చేసి,ఫైళ్లను చించి వేశారు.ఆ రేంజ్ ఆఫీస్ ఎదుట మంచిర్యాల- ఆదిలాబాద్,నిర్మల్ హైవేపై మూడు గంటల పాటు రాస్తారోకో చేశారు.దీంతో ట్రాఫిక్ కు అంతరాయం కలిగి, వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయి జనం ఇక్కట్లు పడ్డారు.

ఈ వ్యవహారం తెలుసుకున్న ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బుజ్జు పటేల్,జీసీసీ రాష్ట్ర చైర్మన్ కోట్నాక తిరుపతి ఉట్నూర్ ఐటీడీఏ పీఓ మంద మకరంద్, మంచిర్యాల ఎసీపీ ప్రకాష్ అక్కడికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు.ఆ తర్వాత స్థానిక ఎస్సై గుర్రం ఉదయ్ కిరణ్ రేంజర్ లక్ష్మీనారాయణతో మాట్లాడి,రేంజర్ అదుపులోని ఐదుగురు యువకులను విడిచిపెట్టారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆదివాసీ యువకులను లాఠీలతో కొట్టి హింసించిన రేంజర్ లక్ష్మీనారాయణపై 24 గంటల్లో చర్యలు తీసుకుంటామని మంచిర్యాల సీఎఫ్, ఎఫ్డీపీటీ శాంతారాం హామీ ఇస్తేనే రాస్తారోకో విరమిస్తామన్నారు.

దీంతో ఉట్నూర్ ఐటీడీఏ పీఓ మంద మకరంద్ మంచిర్యాల డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్,ఎఫ్డీపీటీ శాంతరాంతో రాత్రి ఫోన్ లో ఎమ్మెల్యే బొజ్జు పటేల్ తో మాట్లాడించారు. విచారణ చేసి 24 గంటల్లోపు చర్యలు తీసుకుంటామని శాంతారాం హామీ ఇవ్వడంతో రాత్రి 11:30 గంటలకు ఆదివాసీలు రాస్తారోకో విరమించారు.ఈ కార్యక్రమంలో జన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అజ్మీర్ నందు నాయక్,ఆ గ్రామ సర్పంచి గూగ్లావత్ శంకర్,పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఈ వ్యవహారం రాజకీయ నాయకుల్లో,అటవీ శాఖలో చర్చనీయాంశమైంది.

  • ఆదివాసీ యువకులను కొట్టలేదు..

-ఫారెస్ట్ రేంజర్ లక్ష్మీనారాయణ..

అడవుల్లోకి జంతువుల వేట కోసం వచ్చిన ఆదివాసీ యువకులను కొట్టలేదని,అదుపులోకి తీసుకొని పోలీసుల సూచనతో వదిలిపెట్టినట్లు ఇందనపల్లి ఫారెస్ట్ ఇన్చార్జి రేంజ్ ఆఫీసర్ గోదారి లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు.రాత్రి ఆయన ఫోన్లో మాట్లాడుతూ.. ఆ యువకులు కచ్చితంగా వలలతో అడవి జంతువులను వేటాడడానికి రాగానే వాగు వద్ద అదుపులోకి తీసుకున్నామన్నారు. లేనిపోని ఆరోపణలు తమపై చేయకూడదని తెలిపారు.