నిరుపేదలకు ఎల్ఓసీ పత్రాల అందజేత
- మెరుగైన వైద్యం కోసం రూ.11.64 లక్షల ఆర్థిక సాయం మంజూరు
- ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో బాధితులకు పత్రాల పంపిణీ
భవానిపురం, ఆంధ్రప్రభ: నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆధ్వర్యంలో లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్ఓసీ) పత్రాలను బాధితులకు అందజేశారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఎన్డీయే కార్యాలయంలో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, మాజీ కార్పొరేటర్, మైనారిటీ నాయకుడు మహ్మద్ అబ్దుల్ ఖాదర్, కూటమి నేతలు లింగం శివప్రసాద్, బొడ్డుపల్లి శ్రీనివాస్, ఏలూరు సాయి శరత్ కలిసి పత్రాలను పంపిణీ చేశారు.
46వ డివిజన్ భీమనవారి వీధికి చెందిన సొంగ ప్రభుదాస్ (46) ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ వైద్య సహాయం కోసం దరఖాస్తు చేసుకోగా, ఆయనకు రూ.7 లక్షల విలువైన ఎల్ఓసీ అందజేశారు. అలాగే 44వ డివిజన్ చెరువు సెంటర్‌కు చెందిన బోయా సాయికుమార్ (77) నరాల సంబంధిత వ్యాధికి చికిత్స కోసం దరఖాస్తు చేసుకోగా, ఆయనకు రూ.4.64 లక్షల విలువైన ఎల్ఓసీ మంజూరైంది.
వైద్య సహాయం కోసం దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి ఎల్ఓసీలు మంజూరు చేయించిన ఎమ్మెల్యే సుజనా చౌదరికి బాధితులు, వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
