నకిలీ డీఏపీ ఎరువుల తయారీ ముఠా గుట్టురట్టు
- ఆరుగురు అరెస్ట్.. రూ.2 కోట్ల విలువైన సామగ్రి స్వాధీనం
హుజూర్‌నగర్, ఆంధ్రప్రభ : హుజూర్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని మఠంపల్లి మండలం రఘునాథపాలెం గ్రామంలో నకిలీ డీఏపీ ఎరువులు తయారు చేసి రైతులను మోసం చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకుని, రూ.2 కోట్ల విలువైన నకిలీ ఎరువులు, తయారీ యంత్రాలు, వాహనాలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు కోదాడ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు.
శుక్రవారం హుజూర్‌నగర్ పోలీస్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో డీఏపీ ఎరువుల కొరతను ఆసరాగా చేసుకుని రైతులను మోసం చేయాలనే ఉద్దేశంతో ఈ ముఠా నకిలీ ఎరువుల తయారీకి పాల్పడిందన్నారు.
ఈ నెల 15న మఠంపల్లి మండల వ్యవసాయ అధికారి బొలిశెట్టి శ్రీనివాస్కు అందిన సమాచారంతో మఠంపల్లి పోలీసులు రఘునాథపాలెం గ్రామంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాపారి కొండేటి పిచ్చిరెడ్డి వద్ద నకిలీ డీఏపీ బస్తాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
దీనిపై కేసు నమోదు చేసి హుజూర్‌నగర్ సీఐ చరమందరాజు, మఠంపల్లి ఎస్‌ఐ ప్రవీణ్ కుమార్, మేళ్లచెరువు ఎస్‌ఐ నవీన్ కుమార్ తదితరుల బృందం విచారణ చేపట్టగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఎనిమిది మంది సభ్యులతో కూడిన ముఠా ఈ అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు తేలిందన్నారు.
హైదరాబాద్‌లోని అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతంలో గోదాం ఏర్పాటు చేసి నకిలీ డీఏపీ ఎరువులు తయారు చేస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. అక్కడి నుంచి వివిధ కంపెనీల పేర్లతో ఉన్న బస్తాలు, లోగోలు, నకిలీ ఫాస్ఫేట్, తయారీ యంత్రాలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
ఈ కేసులో ఆరుగురు నిందితులను అరెస్టు చేసి, ఒక డీసీఎం వాహనం, ఒక మారుతి ఎర్టిగా కారు, ఐదు సెల్‌ఫోన్లు, నకిలీ డీఏపీ బస్తాలు, తయారీ యంత్రాలు, సుమారు రూ.2 కోట్ల విలువైన సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని చెప్పారు.
రైతులు వ్యవసాయ శాఖ సూచించిన అధికారిక డీలర్ల వద్ద మాత్రమే ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేయాలని, అనుమానాస్పదంగా నకిలీ ఎరువుల విక్రయాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ శ్రీనివాసరెడ్డి సూచించారు. రైతులను మోసం చేసే నకిలీ ఎరువుల అక్రమ వ్యాపారులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు.
ఈ సమావేశంలో సీఐ చరమందరాజు, ఎస్‌ఐలు ప్రవీణ్ కుమార్, నవీన్ కుమార్, హనుమ నాయక్, ఐడీ పార్టీ సిబ్బంది శంభయ్య, నాగరాజు పాల్గొన్నారు.
