రైల్వే డివిజన్‌కు చరిత్రాత్మక ఘనత…

రైల్వే డివిజన్‌కు చరిత్రాత్మక ఘనత…
22 రోజుల్లోనే రూ 10 కోట్లు టికెట్ చెకింగ్ వసూళ్లు
దక్షిణ మధ్య రైల్వేలో కొత్త రికార్డు..
గత రికార్డు రూ 8.59 కోట్లను దాటేసిన వసూళ్లు
కట్టుదిట్టమైన తనిఖీలతో భారీ ఆదాయం
టికెట్ లేని ప్రయాణాలపై కఠిన చర్యల ఫలితం
విజయవాడ, ఆంధ్రప్రభ : సౌత్ సెంట్రల్ Railway పరిధిలోని విజయవాడ డివిజన్ చరిత్రలోనే అరుదైన ఘనత సాధించింది. 2026 ఏప్రిల్ నెలలో కేవలం 22 రోజుల్లోనే రూ.10 కోట్ల టికెట్ చెకింగ్ ఆదాయాన్ని నమోదు చేసి కొత్త రికార్డు సృష్టించింది. ఇది మొత్తం ఎస్ఆర్సీ జోన్‌లో ఏ డివిజన్ సాధించని అత్యధిక నెలవారీ వసూళ్లుగా నిలిచింది. ఇప్పటివరకు అక్టోబర్ 2025లో నమోదైన రూ 8.59 కోట్ల రికార్డును ఈ నెలలోనే అధిగమించడం విశేషం.
ఇంకా నెల ముగియడానికి ఏడు రోజులు మిగిలి ఉండగానే ఈ స్థాయిలో ఆదాయం సాధించడం డివిజన్ పనితీరు లో ప్రతిభ కనబడుతోంది. డివిజన్ అంతటా నిర్వహించిన ప్రత్యేక టికెట్ తనిఖీ డ్రైవ్‌లు, ఫోర్ట్రెస్ చెక్స్, అంబుష్ చెక్స్ వంటి కట్టుదిట్టమైన చర్యలు ఈ విజయానికి కారణమయ్యాయి. ప్రధాన స్టేషన్లు, ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించడం ద్వారా టికెట్ లేకుండా ప్రయాణించే వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు.
డివిజనల్ రైల్వే మేనేజర్ మోహిత్ సోనాకీయ సిబ్బంది కృషిని అభినందిస్తూ టికెట్ చెకింగ్ సిబ్బంది అప్రమత్తతతో రైల్వే ఆదాయం రక్షితమైంది. అలాగే నిజాయితీగా ప్రయాణించే ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంలో ఇది కీలకంగా మారింది అని తెలిపారు. అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్ ఐ ఎస్ ఆర్ మూర్తి నేతృత్వంలో, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ బి ప్రశాంత కుమార్ మార్గదర్శకత్వంలో టికెట్ చెకింగ్ బృందాలు సమన్వయంతో పనిచేశాయి.
టికెట్ లేకుండా ప్రయాణించడం, తప్పు టికెట్ వినియోగం, నమోదు చేయని సరుకు వంటి ఉల్లంఘనలపై విధించిన జరిమానాల ద్వారా ఈ ఆదాయం వచ్చింది. ఇక 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే ఈ డివిజన్ రూ 76.34 కోట్ల టికెట్ చెకింగ్ ఆదాయంతో ముందంజలో నిలిచింది. రైల్వే అధికారులు ప్రయాణికులు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే టికెట్‌తో ప్రయాణించాలని, లేకపోతే జరిమానాలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
