విజయవాడకు మరో రైల్వే వరం..
- రేపు రాయనపాడు స్టేషన్ ప్రజలకు అంకితం
- రూ.35 కోట్లతో అమృత్ భారత్ పథకంలో ఆధునీకరణ
- ప్రధాని మోదీ చేతుల మీదుగా నేడు వర్చువల్‌గా ప్రారంభం
- విజయవాడకు ప్రత్యామ్నాయ శాటిలైట్ టెర్మినల్‌గా సేవలు
విజయవాడ, ఆంధ్రప్రభ: విజయవాడ ప్రధాన రైల్వే స్టేషన్‌పై పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి ప్రత్యామ్నాయంగా రూపుదిద్దుకున్న రాయనపాడు రైల్వే స్టేషన్ రేపు ప్రజలకు అందుబాటులోకి రానుంది. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రూ.35 కోట్లకు పైగా వ్యయంతో అత్యాధునిక వసతులతో అభివృద్ధి చేసిన ఈ స్టేషన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం వర్చువల్‌గా ప్రారంభించనున్నారు.
విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) చొరవతో పనులు వేగంగా పూర్తయ్యాయి. స్టేషన్లో విశాల ప్లాట్‌ఫారాలు, ఏసీ వెయిటింగ్ హాల్, లిఫ్టులు, ఆధునిక టికెట్ కౌంటర్లు, దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలు, విశాల పార్కింగ్, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, కొండపల్లి కళారూపాలతో ఆకట్టుకునే ముఖద్వారం ఏర్పాటు చేశారు. ప్లాట్ఫారం–1ను 670 మీటర్ల పొడవుతో అభివృద్ధి చేయడంతో పాటు 340 మీటర్ల భారీ షెల్టర్‌ను నిర్మించారు.
ప్రస్తుతం రాయనపాడు మీదుగా రోజుకు 12 రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. భవిష్యత్తులో మరిన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లకు కూడా ఇక్కడ హాల్ట్ కల్పించే అవకాశముందని రైల్వే అధికారులు చెబుతున్నారు. విజయవాడ ప్రధాన స్టేషన్‌పై రద్దీని తగ్గిస్తూ, భవిష్యత్తులో ప్రత్యామ్నాయ శాటిలైట్ టెర్మినల్‌గా, కీలక రైల్వే హబ్‌గా రాయనపాడు అభివృద్ధి చెందనుందని ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) తెలిపారు.



