రాష్ట్రానికి ఆదర్శంగా నలగంపల్లి నెట్‌జీరో విధానం

కుప్పం అంతటా అమలుకు సీఎం చంద్రబాబు ఆదేశం

కుప్పం, ఆంధ్రప్రభ: చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని నలగంపల్లి గ్రామంలో అమలు చేస్తున్న నెట్‌జీరో విధానాన్ని రాష్ట్రానికి ఆదర్శంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కుప్పం పర్యటన రెండో రోజు శనివారం నలగంపల్లి గ్రామాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి, నెట్‌జీరో విధానాన్ని అమలు చేస్తున్న ఇళ్లను పరిశీలించి, అక్కడ అమలు చేస్తున్న పర్యావరణహిత కార్యక్రమాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. నలగంపల్లి నమూనాను కేస్ స్టడీగా తీసుకుని కుప్పం నియోజకవర్గం అంతటా విస్తరించేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు సూచించారు.

గ్రామంలో పర్యటించిన ముఖ్యమంత్రి రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థలు, ఇండక్షన్ కుక్‌టాప్‌లు, వర్షపు నీటి సంరక్షణ విధానాలు, కిచెన్ కంపోస్టింగ్, టెర్రస్ గార్డెనింగ్, కిచెన్ గార్డెనింగ్ వంటి కార్యక్రమాలను పరిశీలించారు. ప్రతి ఇంటిలో పర్యావరణ పరిరక్షణతో పాటు విద్యుత్ పొదుపు, వ్యర్థాల నిర్వహణ, స్వయం సమృద్ధి లక్ష్యంగా చేపడుతున్న చర్యలను గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు.

గ్రామంలోని ఓ ఇంటిని సందర్శించిన సీఎం సోలార్ ప్యానెళ్ల సామర్థ్యం, రోజువారీ విద్యుత్ ఉత్పత్తి, కుటుంబ అవసరాలకు సరిపోతున్న విధానం గురించి వివరాలు తెలుసుకున్నారు. సోలార్ విద్యుత్‌తో ఇండక్షన్ స్టవ్‌లను వినియోగించడం వల్ల నెలకు సుమారు రూ.400 వరకు విద్యుత్, ఇంధన వ్యయంలో ఆదా అవుతోందని లబ్ధిదారులు తెలిపారు. వర్షపు నీటి సంరక్షణ, వంటింటి వ్యర్థాలతో కంపోస్టు తయారీ, ఇంటి అవసరాలకు సరిపడా కూరగాయల సాగు వంటి అంశాలను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా పరిశీలించారు.

నెట్‌జీరో విధానంలో భాగంగా విద్యుత్ ఆధారిత వాహనాల వినియోగాన్ని కూడా ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి సూచించారు. గ్రామస్థాయిలో సర్క్యులర్ ఎకానమీ విధానాన్ని అమలు చేస్తే వ్యర్థాలను సంపదగా మార్చుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. నలగంపల్లి అమలు చేస్తున్న విధానం రాష్ట్రంలోని ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా ఇండక్షన్ స్టవ్‌ల వినియోగంపై కూడా ముఖ్యమంత్రి మాట్లాడారు. ప్రస్తుతం అన్ని రకాల వంటలు ఇండక్షన్‌పై సులభంగా చేసుకునే సాంకేతికత అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు ఇప్పటికే ఇండక్షన్ స్టవ్‌లను అందజేస్తున్నామని చెప్పారు. గ్యాస్ లీకేజీ ప్రమాదాలు తగ్గడంతో పాటు కుటుంబాలకు మరింత భద్రత లభిస్తుందని గ్రామస్థులు వివరించారు.

కుప్పం నియోజకవర్గంలో రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థల విస్తరణ ద్వారా 7,489 మంది ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు, 39,215 మంది బీసీ కుటుంబాలు, 7,381 మంది ఓసీ కుటుంబాలకు ప్రయోజనం కల్పించేలా చర్యలు చేపడుతున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. విద్యుత్ ఖర్చు తగ్గిస్తూ పర్యావరణ పరిరక్షణకు దోహదపడే ఈ విధానాన్ని కుప్పం అంతటా విస్తరించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.