RTC Free Bus Travel | స్త్రీశక్తి పథకంతో మహిళా సాధికారతకు ఊతం

RTC Free Bus Travel | స్త్రీశక్తి పథకంతో మహిళా సాధికారతకు ఊతం

RTC Free Bus Travel | 9 నెలల్లో 67 కోట్ల ఉచిత ప్రయాణాల రికార్డు
ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేషియో భారీ వృద్ధి
ఉద్యోగులు, కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం
ఈవీ బస్సులతో ఆర్టీసీ ఆధునికీకరణ

RTC Free Bus Travel | ఆర్టీసీ కార్మికుల అంకితభావం, చిత్తశుద్ధి కారణంగా కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘స్త్రీశక్తి’ ఉచిత బస్సు ప్రయాణ పథకం సరికొత్త రికార్డులను సృష్టిస్తూ దూసుకుపోతోంది. ఏ పథకం విజయవంతం కావాలన్నా కార్మికుల సేవలే కీలకం.

రాష్ట్రంలో మహిళల ఆర్థికాభివృద్ధి, సాధికారతకు ఈ పథకం ఒక గేమ్ ఛేంజర్‌గా నిలిచింది. ఈ పథకం ప్రారంభమైన తొమ్మిది నెలల్లోనే ఏకంగా 67 కోట్లకు పైగా మహిళా ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారు. ఆర్టీసీని కేవలం ప్రజా రవాణా వ్యవస్థగా కాకుండా మహిళలు, దివ్యాంగులు, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే సంక్షేమ వేదికగా కూటమి ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అమలవుతున్న “స్త్రీశక్తి” మహిళల జీవితాల్లో పెద్ద మార్పు తీసుకొస్తోంది. ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలకు ఆర్థిక వెసులుబాటు కలగడంతోపాటు ఆర్టీసీకి కూడా ప్రయాణికుల ఆదరణ పెరిగింది.


9 నెలల్లో 67 కోట్ల ఉచిత ప్రయాణాలు

2025 ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీశక్తి పథకం తొమ్మిది నెలల్లోనే అనూహ్య స్పందన అందుకుంది. రాష్ట్రవ్యాప్తంగా మహిళలు 67 కోట్ల ఉచిత ప్రయాణాలు చేయగా, ఇందుకోసం ప్రభుత్వం సుమారు రూ.2350 కోట్ల సబ్సిడీ భరించింది. ఆర్టీసీకి ఇప్పటికే రూ.720 కోట్ల మేర రీయింబర్స్‌మెంట్ అందించింది. ఈ పథకం వల్ల ప్రతి కుటుంబానికి నెలకు సగటున రూ.2000 – రూ.2500 వరకు ఆదా అవుతోంది. ఉద్యోగినులు, విద్యార్థినులు, మహిళా రైతులు, చిరువ్యాపారులు తమ ప్రయాణ ఖర్చులు తగ్గడంతో ఆర్థికంగా ఊరట పొందుతున్నారు.


ఆర్టీసీకి పెరిగిన ఆక్యుపెన్సీ

ఆర్టీసీ కార్మికులు అంకితభావంతో పనిచేస్తుండడంతో స్త్రీశక్తి పథకం ప్రభావంతో బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో భారీగా పెరిగింది. గతంలో 60 శాతంగా ఉన్న ఆక్యుపెన్సీ ప్రస్తుతం 92 శాతానికి చేరినట్లు అధికారులు చెబుతున్నారు.

మహిళలతోపాటు పురుష ప్రయాణికుల సంఖ్య కూడా పెరగడం ఆర్టీసీ ఆదాయ వృద్ధికి తోడ్పడుతోంది. ప్రభుత్వం నుంచి సబ్సిడీ అందుతుండగా, పెరిగిన ప్రయాణికుల రద్దీ ద్వారా ఆర్టీసీకి అదనపు ఆదాయం లభిస్తోంది. ఈ విధంగా స్త్రీశక్తి పథకం సంక్షేమంతోపాటు ప్రజా రవాణా వ్యవస్థకు బలం ఇస్తోంది.


ఉద్యోగులు, కార్మికుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి

కూటమి ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల కార్మికుల సంక్షేమంపై కూడా కీలక నిర్ణయాలు తీసుకుంది. రాత్రి వేళల్లో విధులు నిర్వహించే డ్రైవర్లు, కండక్టర్లకు ప్రతి నైట్ డ్యూటీకి రూ.150 చొప్పున నైట్ అవుట్ అలవెన్స్ మంజూరు చేసింది.

దీనివల్ల ఉద్యోగులకు నెలకు రూ.2000 నుంచి రూ.5000 వరకు అదనపు ఆదాయం లభిస్తోంది. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్లను కూడా ప్రభుత్వం వేగవంతం చేసింది. 2020కు ముందు నియమితులైన సుమారు 7000 మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పించడంతో ఉద్యోగుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.


ఎస్బీఐ బీమా, రిటైర్డ్ ఉద్యోగులకు ఈహెచ్ఎస్

ఆర్టీసీ ఉద్యోగులకు కార్మికులకు ఎస్బీఐ ప్రత్యేక బీమా పథకాన్ని వర్తింపజేయడం ద్వారా ప్రభుత్వం భద్రతా కవచం కల్పించింది. రూ.1 కోటి ప్రమాద బీమా, సహజ మరణానికి రూ.10 లక్షల బీమా వంటి ప్రయోజనాలు ఉద్యోగ కుటుంబాలకు ఆర్థిక భరోసా ఇస్తున్నాయి. రిటైర్డ్ ఉద్యోగులకు జీవితాంతం ఈహెచ్ఎస్ వైద్య సేవలు అందేలా తీసుకున్న నిర్ణయం కూడా మానవీయ చర్యగా ప్రశంసలు అందుకుంటోంది.


ఈవీ బస్సులతో ఆధునికీకరణ

ప్రజా రవాణాను ఆధునికీకరించే దిశగా ప్రభుత్వం 1489 కొత్త బస్సులను ప్రవేశపెట్టింది. సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, స్టార్ లైనర్, వెన్నెల బస్సులు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందిస్తున్నాయి. అదనంగా కేంద్ర సహకారంతో సుమారు 1450 ఈవీ బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది. 338 బస్ స్టేషన్ల అభివృద్ధికి రూ.30 కోట్లు కేటాయించగా, డిజిటల్ ఫీడ్‌బ్యాక్ వ్యవస్థ ద్వారా ప్రయాణికుల అభిప్రాయాలను నేరుగా సేకరిస్తున్నారు.

ప్రతివారం ఆర్టీసీ సేవలపై సీఎం సమీక్ష నిర్వహిస్తూ సేవల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీశక్తి పథకం విజయవంతం చేయడంలో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్ల కృషి అభినందనీయం.

– వాసంశెట్టి సుభాష్, కార్మికశాఖ మంత్రి, ఆంధ్రప్రదేశ్