కర్నూలులో అల్లర్లు సృష్టించే కుట్రలు

కర్నూలులో అల్లర్లు సృష్టించే కుట్రలు

వైసీపీ నేతలు ఎస్‌వీ మోహన్‌రెడ్డి, బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని అరెస్టు చేయాలి
టీడీపీ నేత సోమిశెట్టి వెంకటేశ్వర్లు డిమాండ్

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : కర్నూలు నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా కుట్రలు చేస్తున్నారని ఆరోపిస్తూ వైసీపీ నాయకులు ఎస్‌వీ మోహన్‌రెడ్డి, బైరెడ్డి సిద్ధార్థరెడ్డిపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకుని అరెస్టు చేయాలని టీడీపీ నేత, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. బొందిలి కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్‌సింగ్‌తో కలిసి గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.
కర్నూలు నగరంలో ఇప్పటివరకు ప్రశాంత వాతావరణంలో ప్రజలు జీవనం కొనసాగిస్తున్నారని, అయితే వైసీపీ నేతలు రాజకీయ ఆరోపణలతో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

మంత్రి టీజీ భరత్‌పై కక్షసాధింపు రాజకీయాలు చేస్తున్నారంటూ వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. మంత్రి టీజీ భరత్ కర్నూలు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అభివృద్ధికే ప్రాధాన్యత ఇస్తున్నారని, ఎప్పుడూ కక్షపూరిత రాజకీయాలకు పాల్పడలేదని పేర్కొన్నారు. గతంలో అధికారంలో ఉన్న సమయంలో వైసీపీ నాయకులు చేసిన తప్పులపై పోలీసులు చట్టపరంగా చర్యలు తీసుకుంటే, ఆ వ్యవహారాలను మంత్రికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యవహార శైలిని ప్రస్తావిస్తూ రాష్ట్ర ప్రజలకు అన్నీ తెలుసని వ్యాఖ్యానించారు. అదే విధమైన రాజకీయ సంస్కృతిని కర్నూలులో కూడా అమలు చేసేందుకు కొందరు నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. నగరంలో శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలకు పాల్పడుతున్నారనే అనుమానాలు వ్యక్తం చేశారు. బైరెడ్డి సిద్ధార్థరెడ్డిపై కూడా తీవ్ర విమర్శలు చేసిన వెంకటేశ్వర్లు, నేర ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తులు ఇప్పుడు శాంతి భద్రతల గురించి మాట్లాడటం విచిత్రమన్నారు.

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను భయపెట్టే ప్రయత్నాలు ఫలించవని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో చట్టం తన పని తాను చేసుకుంటుందని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే సంస్కృతి తమకు లేదన్నారు. నేరం చేసిన వారిని కాపాడేందుకు వైసీపీ నాయకత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో త్వరలోనే మరిన్ని రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటాయని వ్యాఖ్యానించారు. టీడీపీ కార్యకర్తలు ఎలాంటి బెదిరింపులకు భయపడరని, రాజకీయంగా గట్టి సమాధానం ఇస్తామని హెచ్చరించారు.

Leave a Reply