అర్హత గల ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు..ఎమ్మెల్యే కూన రవికుమార్
పొందూరు(ఆమదాలవలస), ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమమే లక్ష్యంగా అర్హత గల కుటుంబానికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు చేరేలా కట్టుబడి పనిచేస్తోందని ఆమదాలవలస శాసనసభ్యులు, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ తెలిపారు . పొందూరు మండల పరిధిలోని పెనుబర్తి గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వయంగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు 4,000, 6,000, 15,000 రూపాయిల చొప్పున పింఛను నగదును అందజేశారు. ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా సమాజంలోని నిరుపేదలు, ఆసరా లేని వారికి ఆర్థిక భరోసా కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే రవికుమార్ సూచించారు. అర్హులైన వారు ఎవరూ కూడా ప్రభుత్వ పథకాలకు దూరం కాకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఈ సందర్భంగా ఆయన ఆదేశించారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, రాబోయే రోజుల్లో మరిన్ని ప్రయోజనాలు లబ్ధిదారులకు అందుతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, ప్రభుత్వ అధికారులు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
