ప్రభుత్వ విద్యా అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్
దండేపల్లి, ఆంధ్రప్రభ: ప్రభుత్వం కల్పిస్తున్న విద్యా అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం దండేపల్లి మండలం ద్వారక గ్రామంలో నిర్మాణంలో ఉన్న షెడ్యూల్డ్ తెగల బాలుర వసతి గృహ భవన పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలతో పాటు మెనూ ప్రకారం పౌష్టికాహారం, నాణ్యమైన విద్యను అందిస్తోందని తెలిపారు. వసతి గృహ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. గ్రామంలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను పరిశీలించి, పారదర్శకంగా నిర్వహించాలని బూత్ స్థాయి అధికారులను ఆదేశించారు.
మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్, అదనపు గదులు, మరుగుదొడ్ల నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని సూచించారు. వంటశాలను తనిఖీ చేసి ఆహార తయారీలో పరిశుభ్రత పాటించాలని సిబ్బందికి ఆదేశించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న సౌకర్యాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించి, విద్యార్థుల చేరికలను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రోహిత్ దేశ్‌పాండే, ఎంపీడీఓ జాగర్లమూడి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
