కేడీసీసీ బ్యాంకు ముఖ్యకార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు…

కేడీసీసీ బ్యాంకు ముఖ్యకార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు…
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకుకు కొత్త ముఖ్యకార్యనిర్వహణాధికారిగా కొమ్మ శివలీల గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకాలం ఇన్‌ఛార్జి ముఖ్యకార్యనిర్వహణాధికారిగా పనిచేసిన పి. రామాంజనేయులు వద్ద నుంచి అధికార బాధ్యతలను స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం శివలీల మాట్లాడుతూ, తనను ముఖ్యకార్యనిర్వహణాధికారిగా నియమించిన బ్యాంకు వ్యక్తుల ఇన్‌ఛార్జి కమిటీ అధ్యక్షుడు డి. విష్ణువర్ధన్ రెడ్డి, పాలకవర్గ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
జిల్లాలో సహకార బ్యాంకింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేసి, బ్యాంకును అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ప్రస్తుత 2025–26 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు పనితీరును మెరుగుపరచడం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. బ్యాంకు అభివృద్ధి కోసం ఉద్యోగులు సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ముఖ్యంగా చెల్లింపులు జరగకుండా నిలిచిపోయిన రుణాలు (ఎన్‌పీఏలు) తగ్గించడంపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు వెల్లడించారు.
మొండి బకాయిల వసూళ్లను వేగవంతం చేసి బ్యాంకు ఆర్థిక స్థితిని మరింత బలోపేతం చేయాలని సంకల్పం వ్యక్తం చేశారు. జిల్లాలో రైతులు, గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆర్థిక సేవలు అందించడంలో కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో సహకార శాఖాధికారులు, బ్యాంకు సిబ్బంది, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల అధ్యక్షులు, సహకార సంఘాల ప్రధాన కార్యనిర్వాహకులు పరస్పర సమన్వయంతో పనిచేస్తే బ్యాంకు అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని తెలిపారు. సహకార వ్యవస్థ బలోపేతం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను దృఢపరిచే దిశగా చర్యలు తీసుకుంటామని శివలీల స్పష్టం చేశారు.
