కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేసిన కలెక్టర్ లక్ష్మీశ
భవానిపురం, ఆంధ్రప్రభ : కృష్ణా తూర్పు డెల్టా కాలువలకు 3200 క్యూసెక్కుల నీటిని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ బుధవారం విడుదల చేశారు. ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనూరాధ, ఆంధ్రప్రదేశ్ సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షుడు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు, ఎమ్మెల్యే సుజన చౌదరి ఆదేశాలతో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ పాల్గొన్నారు. ఎగువన వర్షాలు లేకపోవడంతో, ఖరీఫ్ సాగు అవసరాల కోసం పులిచింతల ప్రాజెక్టు నుంచి ఈ నీటిని మళ్లించి విడుదల చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ కృష్ణ డెల్టాలో పుష్కలంగా రైతులు పంటలు పండించాలని ఆకాంక్షించారు. 3200 క్యూసెక్కుల నీటిని నేడు కృష్ణ తూర్పు డెల్టాకు విడుదల చేసామని తెలిపారు. ఏరువాక కార్యక్రమం తరువాత నీటి విడుదల అనేది రైతులకు ఆనందించదగ్గ రోజని కలెక్టర్ వెల్లడించారు.
ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కృష్ణమ్మకు పసుపు, కుంకుమ సారే సమర్పించారు ఏపీలో ఇప్పటికే రైతులకు ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద నిధులను అందించిందని ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు తెలిపారు జూలై 1 న నీటి విడుదల ఉంటుందని చెప్పినట్టే నేడు మంత్రి నిమ్మల రామానాయుడు మార్గదర్శకత్వంలో కలెక్టర్ నీటిని విడుదల చేశారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎల్ నినోపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారని ఆ కారణంగా మంత్రి నిమ్మల రామానాయుడు ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారని గోపాలకృష్ణ పేర్కొన్నారు..
