నకిలీ నోట్ల ముఠాపై పోలీసుల దెబ్బ.. ఇద్దరి అరెస్టు
రూ.4.50 లక్షల నకిలీ కరెన్సీ స్వాధీనం.. మరో ఇద్దరి కోసం మూడు ప్రత్యేక బృందాల గాలింపు
ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ: నకిలీ కరెన్సీ నోట్లు చలామణి చేస్తున్న ఇద్దరు నిందితులను ఇబ్రహీంపట్నం పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.500 నోట్ల రూపంలో రూ.4.50 లక్షల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం మూడు ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.
ఈ మేరకు బుధవారం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పశ్చిమ జోన్ డీసీపీ గుణ్ణం రామకృష్ణ కేసు వివరాలను వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నం రామానగర్‌కు చెందిన గుంజ మంగారావు (40), అనంతపురానికి చెందిన రాజా గతంలో వేర్వేరు కేసుల్లో బెంగళూరు జైలులో శిక్ష అనుభవించారు. అక్కడే వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా ఇద్దరూ పరస్పరం సంప్రదింపులు కొనసాగించారు.
అనంతపురానికి చెందిన రాజా నుంచి నకిలీ నోట్లు తెచ్చుకున్న మంగారావు, కొండపల్లి శ్రామికనగర్ (కొత్తగేటు)కు చెందిన వల్లభనేని పవన్ కుమార్ (31), మరో నిందితుడు రాజు సహాయంతో విజయవాడ పరిసర ప్రాంతాల్లో వాటిని చలామణి చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇదే తరహాలో ఇప్పటికే మూడుసార్లు నకిలీ నోట్లను చలామణి చేసినట్లు విచారణలో వెల్లడైందని తెలిపారు.
గత నెల 30వ తేదీ రాత్రి 9.30 గంటలకు అందిన సమాచారం మేరకు పోలీసులు స్థానిక ఖాజిమాన్యంలోని జియో టవర్ రోడ్డులోని కోళ్ల ఫారం వద్ద దాడి నిర్వహించారు. అక్కడ గుంజ మంగారావు, వల్లభనేని పవన్ కుమార్ అలియాస్ పవన్‌ను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.500 నోట్లతో కూడిన తొమ్మిది కట్టలు, మొత్తం రూ.4.50 లక్షల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు.
ఈ కేసులో పరారీలో ఉన్న రాజు, రాజా కోసం మూడు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయని తెలిపారు. అరెస్టయిన ఇద్దరు నిందితులను విజయవాడ కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.
మీడియా సమావేశంలో ఇబ్రహీంపట్నం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎ. సుబ్రహ్మణ్యం, సబ్ ఇన్‌స్పెక్టర్ రవివర్మతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
