ఎరువులు, విత్తన దుకాణాలలో వ్యవసాయ అధికారుల తనిఖీలు
పరకాల, ఆంధ్రప్రభ: పరకాల పట్టణంలో జిల్లా వ్యవసాయాధికారి విజయచంద్ర ఆధ్వర్యంలో ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల దుకాణాల్లో బుధవారం ముమ్మర తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు పాటించని పలు దుకాణాలపై అమ్మకాలు నిలిపివేతతో పాటు నోటీసులు జారీ చేశారు.
జిల్లా వ్యవసాయాధికారి (డీఏఓ) విజయచంద్ర, ఏడీఏ ఆదిరెడ్డి, పరకాల డివిజన్ పరిధిలోని పలు మండలాల వ్యవసాయాధికారులతో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన డాక్యుమెంట్లు, రికార్డులు సమర్పించని కొన్ని దుకాణాల్లో అమ్మకాలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించారు.
నిబంధనల ప్రకారం స్టాక్ బోర్డులు, ధరల పట్టికలు, లైసెన్సులు వినియోగదారులకు కనిపించేలా ప్రదర్శించని దుకాణాల యజమానులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అలాగే స్టాక్ రిజిస్టర్లలో వివరాలు నమోదు చేయని దుకాణాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయాధికారి విజయచంద్ర మాట్లాడుతూ కాలం చెల్లిన (ఎక్స్‌పైర్డ్) విత్తనాలు, పురుగుమందులు విక్రయించరాదని, వాటిని నిబంధనల ప్రకారం డిస్పోజల్ చేయాలని సూచించారు. రైతులకు విక్రయించే ప్రతి వస్తువుకు తప్పనిసరిగా బిల్లులు ఇవ్వాలని స్పష్టం చేశారు.
అధిక ధరలకు అమ్మకాలు, లింక్ బిజినెస్ వంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో పరకాల వ్యవసాయాధికారి శ్రీనివాస్‌తో పాటు దామర, ఆత్మకూరు, శ్యాంపేట, నడికూడ, హసన్‌పర్తి, కాజీపేట, ఐనవోలు, ఎల్కతుర్తి మండలాల వ్యవసాయాధికారులు పాల్గొన్నారు.
