ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు చెల్లించాలని గిరిజనుల విజ్ఞప్తి
ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు చెల్లించాలని గిరిజనుల విజ్ఞప్తి
జైనూర్, ఆంధ్రప్రభ: మండలంలోని పోచంలొద్ది పంచాయతీ పరిధిలోని కొండపటార్ గ్రామానికి చెందిన కోలాం గిరిజనులకు మొదటి విడతలో 16 ఇళ్లు మంజూరయ్యాయని గ్రామ నాయకుడు కన్నీరాం, లబ్ధిదారులు తెలిపారు. గురువారం వారు విలేకరులతో మాట్లాడుతూ, ఇళ్ల నిర్మాణ పనులు దశలవారీగా కొనసాగుతున్నప్పటికీ బిల్లులు నెలల తరబడి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులు మంజూరు చేయాలని గత ఏప్రిల్ నెలలో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు.
బిల్లులు రాకపోవడంతో నిర్మాణ పనులు మధ్యలోనే ఆగిపోయాయని చెప్పారు. ఇళ్ల నిర్మాణం కోసం ఉన్న పాత ఇళ్లను తొలగించడంతో ప్రస్తుతం తాటిపత్రి వేసుకుని నివాసం ఉంటున్నామని లబ్ధిదారులు పేర్కొన్నారు. వర్షాకాలం ప్రారంభం కాకముందే ఇళ్ల నిర్మాణం పూర్తి అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. వర్షాలు పడితే నివాసానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పెండింగ్‌లో ఉన్న ఇళ్ల బిల్లులు మంజూరు చేయాలని, మధ్యలో ఆగిపోయిన నిర్మాణ పనులు పూర్తి అయ్యేలా చూడాలని లబ్ధిదారులు కోరారు.
