అన్న ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తాం

అన్న ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తాం

ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకల్లో కూటమి నేతలు

భవానిపురం, ఆంధ్రప్రభ : అన్న ఎన్టీఆర్ ఆశయాల కొనసాగింపునకు ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కట్టుబడి ఉన్నారని, ఆయన ఆశయాలను కొనసాగిస్తామని మాజీ కార్పొరేటర్లు ఉమ్మడి వెంకటేశ్వరరావు (చంటి), బుల్లా విజయ్ కుమార్, మహాదేవు అప్పాజీరావు, అత్తలూరి ఆదిలక్ష్మి పెదబాబు, మైలవరపు దుర్గారావు, జనసేన నేత సాయి శరత్, టీడీపీ నేత దాడి మురళి కృష్ణ పేర్కొన్నారు.

భవానిపురంలోని ఎన్డీఏ కార్యాలయంలో గురువారం ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ తో కలిసి కూటమి మాజీ కార్పొరేటర్లు, టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు కేక్ కట్ చేసి ఎన్టీఆర్ సేవలను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు (చంటి) మాట్లాడుతూ, తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానేత ఎన్టీఆర్ అని కొనియాడారు. సినీ రంగంలో రాముడు, కృష్ణుడి పాత్రలతో కోట్లాది ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచారని తెలిపారు. ప్రజలకు సేవ చేయడం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి విజయాన్ని సాధించి, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన నాయకుడిగా ఎన్టీఆర్ నిలిచారని అన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతున్నారని, అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాలను ప్రగతి పథంలో నడిపిస్తున్నారని తెలిపారు.

మహిళా సాధికారతపై ఎన్టీఆర్ ప్రాధాన్యం

టీడీపీ నగర మహిళా ఉపాధ్యక్షురాలు పువ్వుల సలోమి మాట్లాడుతూ, మహిళా సాధికారతే లక్ష్యంగా మహిళలకు ఆస్తి హక్కులు కల్పించిన ఘనత ఎన్టీఆర్ దేనని తెలిపారు. సంక్షేమ పథకాల ద్వారా సామాన్య ప్రజలకు అండగా నిలిచారని, ఆయన ఆశయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనసాగిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నేతలు రౌతు రమ్యప్రియ, సరస్వతి, సారిపల్లి రాధాకృష్ణ, బూర కనకరావు, బెవర శ్రీనివాసరావు, గంజి పవన్, ఈగల సాంబశివరావు, శనివారపు శివ, ఇంతియాజ్, పిళ్ళ శ్రీనివాసరావు, సోము వెంకటేశ్వర్లు, బాల కోటి (దాసు), బొల్లేపల్లి కోటేశ్వరరావు, గడ్డిపాటి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.