వడదెబ్బ మృతులకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి
వడదెబ్బ మృతులకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి
- వెంకట్రాములు డిమాండ్
కరీమాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో తీవ్ర ఎండల కారణంగా వడదెబ్బకు గురై ప్రాణాలు కోల్పోతున్న రైతు కూలీలు, శ్రమజీవుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ జాతీయ కార్యవర్గ సభ్యుడు తాటిపాముల వెంకట్రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సోమవారం ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 42 నుంచి 45 డిగ్రీల వరకు నమోదవుతున్నాయని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ఉపాధి పనులకు, వ్యవసాయ పనులకు వెళ్తున్న కూలీలు, ఇతర శ్రమజీవులు వడదెబ్బలకు గురై ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు వివిధ జిల్లాల్లో చోటుచేసుకుంటున్నాయని అన్నారు.
కుటుంబ పోషణ కోసం తప్పనిసరిగా పనులకు వెళ్లాల్సి వస్తున్న కూలీలు ఈ విధంగా ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఎక్స్‌గ్రేషియా చెల్లించడంతో పాటు బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా సహాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.
