ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించిన మంత్రులు
గోదావరి వరద ఉధృతిని పరిశీలించిన మంత్రుల బృందం
గోదావరిఖని, ఆంధ్రప్రభ: పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద సాగర్ ఎల్లంపల్లి ప్రాజెక్టును శనివారం సాయంత్రం రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సందర్శించారు.

ఈ సందర్భంగా ఎల్లంపల్లి ప్రాజెక్టులో గోదావరి వరద ఉధృతిని పరిశీలించి, నీటి ప్రవాహం, ప్రస్తుత పరిస్థితులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

అనంతరం గోదావరి తల్లికి చీర, సారె, పసుపు, కుంకుమలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రులకు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ స్వాగతం పలికారు. మంత్రుల పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
