పట్టణ పేద మహిళల ఆర్థిక స్వావలంబనకు చేయూత

పట్టణ పేద మహిళల ఆర్థిక స్వావలంబనకు చేయూత

కర్నూలు, ఆంధ్రప్రభ: టిీజీ భరత్ ఆధ్వర్యంలో కర్నూలులో పట్టణ పేద మహిళల ఆర్థిక సాధికారత కోసం కీలక కార్యక్రమం చేపట్టారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయ ఆవరణంలో, NECC ఆర్థిక సహకారంతో, MEPMA ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు చికెన్ ఎగ్ కార్ట్స్ పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో కర్నూలు అర్బన్ పరిధిలోని ఐదుగురు మహిళలకు ఐదు ఎగ్ కార్ట్స్‌ను ఉచితంగా అందజేశారు. ఒక్కో కార్ట్ విలువ రూ.50 వేలుగా ఉండగా, మొత్తం ప్రాజెక్టు విలువ రూ.2.50 లక్షలు అని అధికారులు వెల్లడించారు.

ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ మహిళల అభివృద్ధి లేకుండా సమాజ అభివృద్ధి సాధ్యం కాదన్నారు. ప్రభుత్వం మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తోందని పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలు ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి ద్వారా అభివృద్ధి చెందాలని సూచించారు.

జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి మాట్లాడుతూ, పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేద మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆదాయాన్ని పెంచుకుని కుటుంబ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవాలనే ఉద్దేశంతో ఈ పైలెట్ ప్రాజెక్టును అమలు చేస్తున్నట్లు తెలిపారు. గుడ్ల ఉత్పత్తి, వినియోగాన్ని ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ కార్ట్స్ ద్వారా మహిళలు చిన్న వ్యాపారాలు నిర్వహించి స్థిరమైన ఆదాయం పొందే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ జి. శ్రీనివాసులు, ఇతర అధికారులు, మహిళా సంఘాల సభ్యులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.

Leave a Reply